అగ్రనటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూశారు. ఈ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆమె వయసు ఎనభై ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను సెప్టెంబరు 3న ముంబైలోని హీరానందని హాస్పిటల్ లో చేర్పించారు కుటుంబసభ్యులు. అదే ఆసుపత్రిలో అరుణా చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్షయ్ కుమార్ ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ముంబై చేరుకున్నారు.
తన తల్లి మరణవార్తను తెలియజేస్తూ ట్విట్టర్ లో ‘తనే నాకు ముఖ్యమైన వ్యక్తి. ఈ రోజు నేను భరించలేనంత బాధను అనుభవిస్తున్నా. నా మాతృమూర్తి అరుణభాటియా ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. మరోలోకంలో మా నాన్నగారితో ఏకమయ్యారు. మీరు నాకోసం, నా కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
తల్లి చనిపోవడానికి ఒకరోజు ముందే అక్షయ్ తన తల్లి ఆరోగ్యం కోసం ప్రార్ధన చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ, ప్రతి ఒక్కరి ప్రార్ధన తల్లి శ్రేయస్సుకు ఎంతో సహకరిస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆమె మరణించడం అక్షయ్ అభిమానులను కలచి వేస్తోంది. అక్షయ్ అభిమానులు, బాలీవుడ్ నటులు అరుణా భాటియాకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
అక్షయ్ కుమార్ తండ్రి హరిఓం భాటియా. ఈయన భారత సైన్యంలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని యునిసెఫ్ కార్యాలయంలో అకౌంటంట్ గానూ ఉద్యోగం చేశారు. 2000 సంవత్సరంలో ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. అక్షయ్ కు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. తన తండ్రి చనిపోయాక ఆయన గౌరవార్థం తన ప్రొడక్షన్ హౌస్ కి ‘హరిఓం ఎంటర్టైన్మెంట్’ అని పేరు పెట్టారు. పోలీసాఫీసర్ల కోసం హరి ఓం షెల్టర్ పేరుతో బిల్డింగ్ కూడా నిర్మించారు.
Also read: తొలిసారి ఓ దేశ అధికారిక కరెన్సీగా బిట్ కాయిన్
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
Also read: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...