Isha Ambani Met Gala 2024: ప్రపంచ కుబేరుల్లో ఒక‌రు అంబానీ. ఆయ‌న ఫ్యామిలీకి చెందిన వాళ్లు ఏ ఈవెంట్ లో అయినా ఇట్టే మెరిసిపోతుంటారు. ఇక ఇప్పుడు ఇషా అంబానీ కూడా మెట్ గాలా 2024 ఈవెంట్ లో మెరిసిపోయారు. ఆమె వేసుకున్న ఫ్రాక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. "Garden of Time" థీమ్ తో ఆమె సారీ ఫ్రాక్ ను వేసుకున్నారు. పూలు, సీతాకోక చిలుక‌లు, తూనీగ‌ల సిగ్నేచ‌ర్ మోటిఫ్ ల‌తో ఉన్న ఫ్రాక్ లో గార్జియ‌స్ గా క‌నిపించారు ఇషా అంబానీ. పూర్తిగా నేచ‌ర్ థీమ్‌తో చేసిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్‌ బ్యాగ్‌తో వన దేవతలా కనిపించింది ఆమె. ప్ర‌ముఖ డిజైన‌ర్ రాహుల్ మిశ్ర దాన్ని త‌యారు చేశారు. అయితే, ఆ ఫ్రాక్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌పెట్టారు రాహుల్ మిశ్రా. ఈ మేర‌కు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆయ‌న‌. 


ప‌దివేల గంట‌లు.. 


ఇషా అంబానీ వేసుకున్న ఆ ఫ్రాక్ శారీ డిజైన్ చేసేందుకు ప‌దివేల గంట‌లు ప‌ట్టింద‌ట డిజైన‌ర్‌కు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు. అంబానీ ఫ్యామిలీకి డిజైన్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియాతో కలిసి దీన్ని రూపొందించిన‌ట్లు చెప్పారు. నేచ‌ర్ లైఫ్ సైకిల్ ని క్యాప్చ‌ర్ చేసే విధంగా దీన్ని త‌యారు చేశారు. పెర‌గ‌డంలో ఉండే బ్యూటీ, విక‌సించ‌డం, వాడిపోవ‌డం దీంట్లో చూపించారు.  


“ఒక గార్డెన్‌లో ర‌క‌ర‌కాల పూల మొక్క‌లు మొలుస్తాయి, పూలు విక‌సిస్తాయి.. ఆ తర్వాత వాడిపోతాయి. ఆ లైఫ్ జర్నీనే ఈ డ్రెస్ లో హైలైట్ చేశాం. సృష్టి, విధ్వంసం అనేది ఒక చ‌క్రం లాంటిది. మ‌ర‌ణం త‌ర్వాత ఆ అవ‌శేషాల నుంచి ఉద్భ‌వించే కొత్త జీవితపు అర్థం తెలుస్తుంది. ఈ సైకిల్‌లో ముగింపు ఉండ‌దు. దాన్నే ఆర్ట్ లా థీమ్‌కు త‌గ్గ‌ట్లు చేశాం” అని చెప్పారు. ఇషా అంబానీ వేసుకున్న ఫ్రాక్ కి 'రివ‌ర్ ఆఫ్ లైఫ్' అని స‌రిగ్గా స‌రిపోయే టైటిల్. మిశ్రా పాత డిజైన్స్‌ను షో కేస్ చేస్తూ దీన్ని త‌యారు చేశారు. 


“ఈ గార్డెన్ లో త్రీ డైమెన్ష‌న‌ల్ బార్డ్స్, మోత్స్, బ‌ట‌ర్ ఫ్లైస్, స‌ముద్ర జీవులు, వివిధ రకాల అప్లిక్ టెక్నిక్‌ల ద్వారా ఇంకా ఎన్నో త‌యారు చేశాం. లైట్ షిమ్మ‌రీ బేస్ మీద ట్రెడ్ ఎంబ్రాయిడ‌రీతో, రిచ్ స‌ప్లిమెంటెడ్ మెటీరియ‌ల్స్ అయిన రిచ్ రైన్ స్టోన్స్, సీక్విన్స్, బ‌గ‌ల్ బీడ్స్, ఝ‌రీ, కుంధన్ లాంటి ఎన్నో మెటిరియ‌ల్స్ దీంట్లో వాడాం. దాంతో పాటుగా ఏన్షియంట్ టెక్నిక్స్ అయిన ఎంబ్రాయిడ‌రీ, ఫ‌రీష‌, జ‌ర్దోజీ, న‌క్షి, ద‌బ్కా, ఫ్రెంచ్ నాట్స్ లాంటివి కూడా ఉప‌యోగించి ఈ ఫ్రాక్ త‌యారు చేశాం" అంటూ మొద‌టి సారి త‌న వ‌ర్క్ గురించి బ‌య‌ట పెట్టారు డిజైన‌ర్. 



ఎంతోమందికి ఉపాధి.. 


ఈ గౌన్ ని ట్రెడిష‌నల్ ప‌ద్ధ‌తిలో త‌యారు చేశారు. హ్యాండ్ ఎంబ్రాయిడ‌రీ చేశారు. దీంతో దేశంలోని వివిధ గ్రామాల‌కు చెందిన క‌ళాకారుల‌ను పిలిపించి వ‌ర్క్ చేయించారు. దీంతో వంద‌లాది మందికి ఎంప్లాయిమెంట్ క‌ల్పించిన‌ట్లు అయ్యింది. దీంతో కేవ‌లం ఆ డ్రెస్ లో ఆమె అందంగా క‌నిపించ‌డ‌మే కాదు. మ‌న దేశ క‌ళ‌ను, గొప్ప‌తనాన్ని అక్క‌డ చూపించేలా చేసింది. మ‌న దేశ క‌ళాకారుల టాలెంట్ ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది. ఇండియ‌న్ ఫ్యాష‌న్ గ్లోబ‌ల్ స్టేజ్ మీద మెరిసిపోయింది. 


2017 నుంచి.. 


అంబానీ గారాల ప‌ట్టి ఇషా అంబానీ 2017లో మెట్ గాలా ఈవెంట్ లో అరంగేట్రం చేసింది. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్‌ని  డిజైన్‌ చేసిన బ్లాక్‌ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాహుల్ మిశ్ర త‌యారు చేశారు. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్  వేదికగా మెట్ గాలా జ‌రిగింది.


Also Read: నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు సాయి కార్తీక్... 100 కోట్లు!