నిర్మాతలుగా మారిన హీరో హీరోయిన్లు ఉన్నారు. దర్శకులు ఉన్నారు. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగీత దర్శకులు అరుదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు నిర్మాతలుగా మారినా విరివిగా సినిమాలు తీయలేదు. అయితే... నిర్మాణంలోకి వచ్చిన సంగీత దర్శకుల జాబితాలోకి సాయి కార్తీక్ చేరారు. నారా రోహిత్ 'ప్రతినిధి', విష్ణు మంచు 'రౌడీ', రవితేజ 'రాజా ది గ్రేట్' వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించిన ఆయన... '100 క్రోర్స్'తో నిర్మాతగా మారారు. 


వాస్తవ ఘటనల నేపథ్యంలో '100 క్రోర్స్'
''2016లో జరిగిన ఓ వాస్తవ కథ ఆధారంగా తీసిన చిత్రమిది. కరోనా తర్వాత మేం ఈ పాయింట్‌ అనుకుని సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ చూసిన వారందరూ బాగుందని మెచ్చుకున్నారు. '100 క్రోర్స్' పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది'' అని సాయి కార్తీక్ అన్నారు. ఎస్.ఎస్. స్టూడియోస్ పతాకంపై దివిజా కార్తీక్ (Sai Karthik First Movie As Producer)తో కలిసి ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా '100 క్రోర్స్'. విరాట్ చక్రవర్తి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్, యామీ, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. ఇంకా లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ ప్రధాన తారాగణం.


దర్శకులు వీరశంకర్, మల్లిక్ రామ్, నిర్మాతలు హర్షిత్ రెడ్డి, దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా '100 క్రోర్స్' టైటిల్ లుక్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ మూవీ టైటిల్ పోస్టర్ సోమవారం విడుదల చేశారు. ''టైటిల్ ఆసక్తికరంగా ఉంది. రెండు మూడేళ్ల క్రితం ఈ సినిమా గురించి సాయి కార్తీక్ చెప్పాడు. కొత్త దర్శకుడికి, అతడికి ఆల్ ది బెస్ట్'' అని దామోదర ప్రసాద్ అన్నారు.


Also Read: 'స్వయంభు'కు భారీ బడ్జెట్ - నిఖిల్ సినిమాలో ఒక్క వార్ ఎపిసోడ్‌కు 8 కోట్లు



''డీమానిటైజేషన్‌ టైంలో వంద కోట్ల చుట్టూ తిరిగే కథతో ఫస్ట్ టైం సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని సాయి కార్తీక్ చెప్పారు. నాకు ఆయన సంగీతమంటే ఇష్టం. ఈ సినిమా హిట్ అవ్వాలి'' అని హర్షిత్ రెడ్డి ఆకాంక్షించారు. '100 క్రోర్స్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కన్నడ నటుడు చేతన్ మంచి విజయం అందుకోవాలని, అతడిని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని, సాయి కార్తీక్ నిర్మాతగా లాభాలు అందుకోవాలని వీర శంకర్, మల్లిక్ రామ్ బెస్ట్ విషెష్ చెప్పారు. సాయి కార్తీక్ గారితో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు చేతన్.


Also Readమారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?



రాహుల్, చేతన్, యామీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, సంగీత దర్శకుడు: సాయి కార్తీక్, నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్. స్టూడియోస్, నిర్మాతలు: దివిజా కార్తీక్ - సాయి కార్తీక్, సహ నిర్మాత: కళ్యాణ్ చక్రవర్తి .జి, దర్శకుడు : విరాట్ చక్రవర్తి.