Instant Garlic Pickle Recipe in Telugu : ఈ సీజన్​లో సాధారణంగా మ్యాంగో పికిల్స్ ఎక్కువగా పడతారు. అయితే ఈసారి ఆరోగ్య ప్రయోజనాల కోసం వెల్లుల్లి పచ్చడి చేసుకోండి. దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. మంచి రుచితో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అందుకే దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. మరి ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? హెల్త్ బెనిఫిట్స్ ఏంటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


నూనె - పావు కప్పు


వెల్లుల్లి - 25 రెబ్బలు


అల్లం - 2 టేబుల్ స్పూన్లు


పచ్చిమిర్చి - 3


కారం - 1 టేబుల్ స్పూన్


పసుపు - అర టీస్పూన్


మెంతి గింజలు - పావు టీస్పూన్ 


ఆవాలు - 1 టీస్పూన్


జీలకర్ర - అర టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత


నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు 


తయారీ విధానం 


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టండి. దానిలో కొద్దిగా నూనె వేసి.. కొన్ని ఆవాలు వేయాలి. అవి వేగుతున్న సమయంలో పొట్టుతీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వెల్లుల్లి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. అనంతరం పసుపు, కారం వేయాలి. ఇవి వేసినప్పుడు మంటను సిమ్ చేయాలి. లేదంటే కారం, పసుపు మాడిపోయే ప్రమాదముంది. అవి మిక్స్ చేసి.. స్టౌవ్ ఆపేయాలి.


ఇప్పుడు మరో పాన్ తీసుకుని దానిని వెలిగించిన స్టౌవ్​పై ఉంచాలి. దానిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేయాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మంచిగా పొడి చేయాలి. ఈ పౌడర్​ను ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అనంతరం ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే ఇన్​స్టాంట్ వెల్లుల్లి ఊరగాయ రెడీ. దీనిని అన్నంతో, టిఫిన్స్తో కలిపి తీసుకోవచ్చు.


వెల్లుల్లి ఊరగాయతో హెల్త్ బెనిఫిట్స్..


వెల్లుల్లిలో ఆర్గానో సల్ఫర్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్​కు కారణమయ్యే హానికరమైన కణాలను నాశనం చేస్తుంది. రొమ్ము క్యాన్సర్, కడుపు, ఊపిరితిత్తుల​, మెదడు భాగాలకు వచ్చే వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్​లను తగ్గించి.. గుండె సమస్యలను దూరం చేస్తుంది. వెల్లుల్లి ఉండే యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రక్త ప్రసరణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. 


మీకు ఆర్థరైటిస్ ఉందా? అయితే మీరు కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి వెల్లుల్లి ఊరగాయ తీసుకోవచ్చు. వెల్లుల్లిలోని యాంటీ ఆర్థరైటిక్ గుణాలు.. సమస్యకు పరిష్కారం చూపిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, ఫ్లూ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అంతేకాకుండా వీటిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని రోజూ తినేయకుండా.. వారంలో ఒకటి లేదా రెండుసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి. 


Also Read : నల్లని శనగలతో టేస్టీ దోశను ఇలా చేసేయండి.. ప్రోటీన్​ ప్యాక్డ్ బ్రేక్​ఫాస్ట్ ఇది