Chickpeas Dosa for Breakfast : శనగలను ఉడకబెట్టి నైవేద్యంగా పెడతారు. కొన్ని సందర్భాల్లో వివిధ రకాల వంటల్లో వాడుతారు. అయితే ఈ నల్లని శనగలతో టేస్టీ దోశలు కూడా వేసుకోవచ్చు తెలుసా? హెల్తీగా ఉండేందుకు, రుచికోసం మీరు శనగలతో దోశలు ట్రై చేయవచ్చు. బ్రేక్​ఫాస్ట్​లో ప్రోటీన్​ తీసుకునేవారికి ఈ రకమైన దోశలు మంచి ఎంపిక. ఇవి మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యపీగా తినగలిగే దోశలు ఇవి అంటున్నారు నిపుణులు. అయితే వీటిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.


కావాల్సిన పదార్థాలు


నల్లని శనగలు - అరకప్పు


రవ్వ - అర కప్పు


అల్లం - అంగుళం


పచ్చిమిర్చి  - 2 


వెల్లుల్లి - 5 రెబ్బలు 


కరివేపాకు - 1 రెమ్మ


కొత్తిమీర - చిన్న కట్ట


జీలకర్ర - అర టీస్పూన్


పెరుగు - పావు కప్పు


ఉప్పు - రుచికి తగినంత 


తయారీ విధానం


ముందుగా శనగలను రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దానినిని పేస్టుగా చేసుకోవాలి. ఇప్పుడు దానిలో పెరుగు వేయాలి. అల్లం, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తురిమి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తమీర, కరివేపాకును కూడా చిన్నగా తురుముకోవాలి. రవ్వను కూడా వేసి మొత్తం అన్ని కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు నీటిని వేసి.. పిండి మృదువుగా మారేవరకు కలపండి. చివరిగా ఉప్పు వేసి కలిపి.. ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి. 


ఇప్పుడు పిండిలో అన్ని బాగా కలుస్తాయి. ఇప్పుడు దోశలు వేసేందుకు పిండి అనువుగా ఉందో లేదో చూసుకోవాలి. దానికి అనుగుణంగా మరింత నీరు అవసరమైతే వేయాలి. అప్పుడే దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మీడిమం మంట మీద నాన్​స్టిక్​ దోశ పాన్ లేదా.. దోశ పెనం ఉంచండి. అది వేడి అయిన తర్వాత.. నూనె అప్లై చేసి.. పిండిని గరిటెతో తీసుకుని దోశలు వేసుకోవాలి. దోశ అంచుల చుట్టూ, దోశపైన నూనె వేయాలి. దోశ బంగారు గోధుమ రంగు, క్రిస్పీగా మారేవరకు రోస్ట్ చేసుకోవాలి. దోశ పలుచగా వేసుకుని ఇలా రోస్ట్ చేస్తే రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. కాస్త మందంగా వేసుకుంటే కచ్చితంగా రెండోవైపు కూడా రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే వేడి వేడి టేస్టీ దోశలు రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా టమోటా చట్నీతో తీసుకుంటే అదిరిపోతుంది. 


దోశతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే


ఈ టేస్టీ దోశలు పూర్తిగా ప్రోటీన్​తో నిండి ఉంటాయి. కేవలం రుచిని మాత్రమే అందించడం కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తాయి. ఎందుకంటే శనగల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని పోషకమైన ఆహార ఎంపిక అంటారు. గ్లూటెన్ ఇబ్బందులున్నవారు హాయిగా వీటిని ఆస్వాదించవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తినగలిగే రెసిపీ ఇది.  


Also Read : ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది