Laksar Railway Station: దొంగతనాలు పలు రకాలు. దొంగలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఇంటి యజమానులు ఊర్లకు వెళ్లినప్పుడు, ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి ఇంట్లో వస్తువులు స్వాహా చేసేవారు కొందరు. రాత్రి వేళ ఆరుబయట నిద్రిస్తుంటే గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లను గుళ్ల చేసేవారు మరికొందరు. ఒంటరిగా ఉండే వారే లక్ష్యంగా ఇళ్లను దోపిడీ చేసే వారు ఇంకొందరు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు ఇలా ప్రతి చోట దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇలా నిత్యం ఎంతో మంది జేబుకు కత్తెర వేస్తూనే ఉంటారు. 


వీటితో పాటు రైళ్లలో జరిగే దొంగతనాలు ఇంకో రకం. రన్నింగ్ ట్రైన్‌లో డోర్ దగ్గరో, కిటికీ దగ్గరో ఉన్న వారి ఫోన్లు లాక్కెళ్తుంటారు. ఇటీవల రన్నింగ్‌ ట్రైన్లలో ఫోన్ల చోరీకి యత్నించి దొంగలు దొరికిపోయిన ఘటనలు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే మరికొందరు ఏకంగా దర్జాగా బోగిల్లో ప్రయాణికుల్లా ఫోజ్ కొడుతూ..  అందరూ పడుకున్నాక చేతికి పని చెబుతారు. ప్రయాణికుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, ఇతర విలువైన వస్తువులు కాజేస్తారు. ఇంకొందరు దొంగలు ఏకంగా రైళ్లను ఆపేసి ప్రయాణికులను దోచుకుంటారు. నిర్మానుష్య ప్రదేశాలు, కొండల మధ్యలో రైళ్లు వెళ్తున్నప్పుడు రైళ్లను ఆపివేసి ప్రయాణికులను భయపెట్టి వారి వద్ద ఉన్న వస్తువులను మొత్తం దోచేస్తారు. ఇలాంటి దొంగతనాలు ఇటీవల పెరిగిపోయాయి. ఏపీలో కడప, యర్రగుంట్ల మధ్య రైళ్లలో గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి.


ఉత్తరాఖండ్‌లో సిగ్నల్ లైట్లకు బురద మట్టి పూసి..
ఇప్పుడు ఈ దొంగల గోల మాకెందుకు అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లో జరిగిన చోరీ గురించి తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. సాధారణంగా రైళ్ల దోపిడీకి భిన్నంగా సరికొత్తగా దోపిడీకి యత్నించారు. ఉత్తరాఖండ్‌లోని లక్సర్‌లో రైలు సిగ్నల్‌ లైట్లకు బురద రాసి రెండు రైళ్లలో దోపిడీకి దుండగులు విఫలయత్నం చేశారు. మొరాదాబాద్‌ - సహారన్‌పుర్‌ రైల్వే డివిజన్‌లోని లక్సర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైళ్ల దోపిడీకి దొంగలు స్కెచ్ వేశారు. ప్లాన్‌లో భాగంగా రైలు సిగ్నల్‌కు దుండగులు బురద పూసి సిగ్నల్‌ కనిపించకుండా చేశారు. ఆ మార్గంలో వస్తున్న  పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్, గోరఖ్‌పుర్‌- చండీగఢ్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు సిగ్నల్ కనిపించకపోవడంతో నిలిచిపోయాయి.


అదే అదునుగా దుండగులు రైళ్లలోకి చొరబడ్డారు. ప్రయాణికుల వస్తువులు, నగదును దోపీడీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. బంగారం, డబ్బు, వస్తువులు ఇవ్వాలని బెదిరించారు. అయితే దొంగలకు ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చారు. రైళ్లలోని వారంతా ఒక్కసారిగా ఎదురు తిరగడంతో దొంగలు తోక ముడిచారు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనతో అప్రమత్తమైన లోకో పైలట్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లక్సర్‌ ఆర్పీఎఫ్‌ ఇన్‌ఛార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి శివాచ్, జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ సంజయ్‌ శర్మ, జీఆర్పీ ఎస్పీ సరితా డోభాల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రయాణికుల ధైర్యాన్ని అధికారులు మెచ్చుకున్నారు.