Election Commission Of India: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు  పెద్ద ఎత్తున ప్రయత్నించారు. వారికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఎన్నికల తాయిళాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మాదక ద్రవ్యాలు, ఇతర తాయిలాల విలువ రూ.8,889 కోట్ల ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పట్టుబడిన వాటిలో 45 శాతం మాదక ద్రవ్యాలు ఉన్నాయని, వాటి విలువ రూ.3,958 కోట్లు ఉంటుందని ఈసీ వెల్లడించింది. 


డ్రగ్స్‌ విలువే దాదాపు 4 వేల కోట్లు!
స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.849.15 కోట్ల నగదు, రూ.814.85 కోట్లు విలువ చేసే మద్యం, రూ.3,958 కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాలు, రూ.1,260.33 కోట్లు విలువ చేసే బంగారం, వెండి వంటి ఆభరణాలు, అలాగే రూ.2006.59 కోట్లు విలువ చేసే ఇతర తాయిళాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల స్వాధీనంపై ఈసారి ప్రత్యేక దృష్టిసారించినట్లు పేర్కొంది. కేవలం మూడు రోజుల్లోనే గుజరాత్ ఏటీఎస్‌, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లు రూ.892 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఈసీ వెల్లడించింది.


తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
గుజరాత్‌లో అత్యధికంగా రూ.1,461.73 కోట్ల విలువైన ప్రలోభాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ నివేదికలో వెల్లడైంది. రెండో స్థానంలో రాజస్థాన్‌ (రూ.1133.82 కోట్లు), మూడో స్థానంలో పంజాబ్‌ (రూ.734.54 కోట్లు) ఉన్నట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. అలాగే తెలుగు రాష్ట్రాల వివరాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రూ.301.75 కోట్లు, తెలంగాణలో రూ.333.55 కోట్ల సొత్తు జప్తు చేసినట్లు ఈసీ తెలిపింది. అత్యల్పంగా లక్షదీవుల్లో రూ.7 లక్షలు, లడక్‌లో రూ.11 లక్షలు పట్టుపడింది.


అక్రమాలకు చెక్‌మెట్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎన్నికలలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, డబ్బు తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువత భవిష్యత్తు, తద్వారా దేశాన్ని కాపాడటంలో డ్రగ్స్ నియంత్రణ కీలకమన్నారు. దేశం మొత్తం మీద పట్టుబడిన ఎన్నికల తాయిళాల్లో  45 శాతం దాదాపు రూ.3958 కోట్లు విలువ చేసే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. డ్రగ్స్‌కు అడ్డుకుట్ట వేసేందుకు ఈసీలు ఎస్ జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డీజీతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించామని, అలాగే డీఆర్‌ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, ఇతర ఏజెన్సీల సహకారంతో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు.


123 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పటిష్ట భద్రత
గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నోయిడా పోలీసులు గ్రేటర్ నోయిడాలోని డ్రగ్ ఫ్యాక్టరీలో రూ.150 కోట్లు విలువ చేసే 26.7 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ESMS) కింద ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గాల కోసం 656 మంది పరిశీలకులను నియమించామని, అలాగే మరో 125 మంది చెక్ పోస్ట్‌లు, గ్రౌండ్ లెవల్ టీమ్‌ల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారని ఈసీ తెలిపారు. 123 పార్లమెంటరీ నియోజకవర్గాలలో సమస్యాత్మక లేదా సున్నిత ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో  ఎక్కువ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.