PM Modi News: దేశవ్యాప్తంగా ఈ సారి చర్చ మోదీ మరోసారి ప్రధానిగా తిరిగి వస్తారా లేదా అనే దానిపైనే కొనసాగుతోంది. దీనిపై జోరుగా బెట్టింగులు సైతం కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇటీవల బీజేపీ ఎన్డీయే కూటమికి 300 కంటే తక్కువ వస్తాయనే అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లలో పతనం నమోదైంది. దీనిపై ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఇన్వెస్టర్లలో ధైర్యం నింపే మాటలు చెప్పారు.


ప్రస్తుత స్థాయిల వద్దే ఈక్విటీ మార్కెట్లు
ప్రస్తుతం నిపుణుల అంచనాల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుత స్థాయిల వద్దే కొనసాగుతాయని ఈల్డ్ మ్యాక్సిమైజర్ యోగేష్ మెహతా అంచనా అంచనా వేశారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 21,700-22,800 మధ్య స్థాయిలో కొనసాగుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం నిఫ్టీ సూచీ 22,466 స్థాయిల వద్ద కొనసాగుతోంది. అయితే నిపుణులు మాత్రం ఈసారి మోదీ మరోసారి ప్రధానిగా ఎన్నికతై ప్రధానంగా రైల్వేలు, ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డిఫెన్స్, పవర్, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల షేర్లు సూపర్ రాబడులను అందిస్తాయని అంచనా వేశారు. 


దలాల్ స్ట్రీట్‌లో పలు కంపెనీలు దౌడు 
అయితే ఇప్పటికే పైన పేర్కొన్న రంగాలకు చెందిన అనేక కంపెనీలు దలాల్ స్ట్రీట్‌లో దౌడు తీస్తున్నాయి. ఉదాహరణకు మే 17, 2023 నుంచి.. డిఫెన్స్ రంగానికి చెందిన ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ 124 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వంటి డిఫెన్స్ 194 శాతం లాభపడ్డాయి. అలాగే నైబ్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్, డాటా ప్యాట్రన్, పరాస్ డిఫెన్స్ వంటి కంపెనీలు సైతం మంచి రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి. ఇక ప్రభుత్వ యాజమాన్యంలోని 50 సంస్థలు గడచిన ఏడాది కాలంలో 100 శాతం కంటే ఎక్కువ ర్యాలీని నమోదు చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ ఏడాది కాలంలో అత్యధికంగా 387 శాతం ర్యాలీతో ముందంజలో ఉంది. 


IFCI, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(IRFC), హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, REC కూడా 300% కంటే ఎక్కువ లాభపడ్డాయి. ఇదిలా ఉండగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రతికూల లేదా ఊహించని ఫలితం వెలువడితే దలాల్ స్ట్రీట్‌ తీవ్ర పతనాన్ని చూడాల్సి వస్తుందని మెహతా అన్నారు. ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే దీర్ఘకాలికంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ల పనితీరు విస్తృతంగా ఉందని అన్నారు. ఈ క్రమంలో కొత్త పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వ్యూహంతో ఉన్నట్లయితే ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టొచ్చని యోగేష్ మెహతా సూచించారు. రానున్న పదేళ్ల కాలంలో ఈక్విటీలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మెహతా అన్నారు.