Independence Day 2024 Theme : రెండు శతాబ్ధాల పాటు కొనసాగిన బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ పోరాటంలో గెలిచినందుకుగానూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 15, 2024తో దేశవ్యాప్తంగా మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఈరోజు ఏమి చేస్తారు? స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


స్వాతంత్య్ర దినోత్సవ థీమ్


ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఓ థీమ్​తో నిర్వహిస్తూ ఉంటారు. ఇండియాకు ఇండిపెండెన్స్​ డే వచ్చి 78వ సంవత్సరంలోకి అడుగుతుంది. ఈ సమయంలో ఈ స్పెషల్​ డే థీమ్​గా వీక్షిత్ భారత్​ని 2024కు గానూ థీమ్​గా ఎంచుకుంది. దీని ప్రకారం 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. అందుకే ఆ సమయానికి భారతదేశాన్ని సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం ఈ థీమ్​ని ఎంచుకుంది. 


స్వాతంత్య్ర దినోత్సవ చరిత్ర ఇదే


భారతదేశంలో రెండు శతాబ్ధాల పాటు.. బ్రిటిష్ పాలన కొనసాగింది. ప్రజలను హింసిస్తూ.. పన్నులు భారం వేసి జాత్యాహంకారంతో బ్రిటిష్ వాళ్లు ఇండియాలో పాలన చేశారు. దీని నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అది స్వాతంత్య్ర పోరాటానికి దారి తీసింది. 1857 తిరుగుబాటుతో ఈ స్వాతంత్య్ర పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదినీ కదిలించింది. భారత పరిపాలనలో బ్రిటీష్ వారి అసమర్థతను ఇది బహిర్గతం చేసింది.


అనంతరం 1920ల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు ఊపందుకుంది. భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ జూలై 4, 1947న ప్రవేశపెట్టింది. అంతిమంగా ఇది ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందిన జ్ఞాపకార్థంగా ఈ స్పెషల్​ డేని ఏటా జరుపుకుంటాము. 


స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత


దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ఇండిపెండెన్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందరో సమరయోధులు సేవలు, త్యాగాలను గుర్తిస్తూ.. వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. దీనివల్ల ముందుతరం వారికి స్వాతంత్య్ర ప్రాముఖ్యత తెలుస్తుంది. అందుకే ఈ రోజును దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. 


Also Read : ఆగస్టు 15ని 90's కిడ్స్ ఎలా జరుపుకునేవారో తెలుసా? అలెక్సా ప్లీజ్ ప్లే ఆ రోజులు.. మళ్లీరావు..


స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్​లాల్ నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటూ తన ఐకానిక్ ప్రసంగాన్ని అందించి.. ఢిల్లీలోని ఎర్రకోటపై భారతీయ జెండాను ఎగురవేశారు. ఇది భారతదేశ చరిత్రలో కొత్త అధ్యయాన్ని సూచిస్తుంది. ఈ సంప్రదాయాన్ని ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లాహోరీ గేట్​పై జెండాను ఎగురవేసి.. జాతీకి తమ ప్రసంగాన్ని అందిస్తారు. 


ఎలా జరుపుకుంటామంటే.. 


స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, పలు ఆఫీస్​లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు పాడటం చేస్తారు. పోరాటయోధులు, స్వాతంత్య్రం గురించిన ప్రసంగాలు అందిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగం అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి తన ప్రసంగాన్ని అందించనున్నారు. దేశ పురోగతిని, అభివృద్ధిని.. ఈ స్వాతంత్య్రాన్ని మనకి తెచ్చి పెట్టి పోరాటయోధులను స్మరించుకుంటూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 


Also Read : స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024.. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో షేర్ చేసుకునేందుకు బెస్ట్ కోట్స్ ఇవే