IRCTC : కలియుగ వైకుంఠం తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలు కాదు. అటు దర్శనంతోపాటు ఇటు ప్రయాణ టికెట్లూ ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వారి కోసం.. శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలతోపాటు చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. సో.. మీరు కూడా తిరుపతి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా అయితే ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి.
WEEKEND TRIP TO TIRUMALA DARSHAN (SCBR06)పేరుతో.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ టూర్ మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్లో భాగంగా తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలనూ సందర్శించవచ్చు. మీరు ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే.. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి విశాఖపట్నం చేరుకోవచ్చు.
టూర్ కొనసాగనుందిలా :
* మొదటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రైలు నం. 17488 విశాఖపట్నం నుంచి తిరుపతికి రైలు స్టార్ట్ అవుతుంది. ఒక పగలు, రాత్రి తిరుపతికి చేరడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో రైలులో భోజనం అందించరు.
* తిరుపతి రైల్వేస్టేషన్‌కు తెల్లవారుజామున 04:05 గంటలకు చేరుకుంటారు. తిరుపతి నుండి పికప్ చేసుకుని రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాలను దర్శించుకుని హోటల్‌కు వస్తారు. నైట్ డిన్నర్ తర్వాత అక్కడే బస ఉంటుంది.
* మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి తిరుచానూరు ఆలయం, కాళహస్తి దేవాలయాలను దర్శించుకుంటారు. తర్వాత తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం ఉంటుంది. తర్వాత హోటల్ కి వచ్చి గంట విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్‌లో రాత్రి ఎనిమిది గంటలకు రైలు నం. 17487రెడీగా ఉంటుంది. తిరుపతి నుంచి విశాఖపట్నానికి తెల్లారి ఉదయం 11.30గంటలకు చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరల వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే.. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 27900గా నిర్ణయించారు. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 16575, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.13540గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వేరు ధరలు ఉన్నాయి. పిల్లలకు బెడ్ తో పాటు అయితే రూ.9950, బెడ్ లేకుండా అయితే రూ.7290గా నిర్ణయించారు. ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం www.irctctourism.com ను సంప్రదించవచ్చు.
గుర్తుంచుకోవాల్సినవి :
* తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలి.
* 12 ఏళ్లలోపు చిన్నారులకు లడ్డూ ప్రసాదం ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి.
* ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ ఆలయంలో దర్శనం కవర్ అవుతాయి.
* యాత్రికులకు గైడ్ సదుపాయం, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.