మన శరీరానికి జింక్ చాలా అవసరం. రోగనిరోధక శక్తి, కణ విభజన, కణాల ఎదుగుదల, ప్రొటీన్లు, డీఎన్ఏ నిర్మాణం వంటి వాటికి దాదాపు 300 ఎంజైమ్‌లు అవసరం. ఆ ఎంజైమ్‌లను పనిచేసేలా చేయడం కోసం జింక్ అత్యవసరం. మనం తినే ఆహారంలో చాలా పరిమిత పరిమాణంలో జింక్ లభిస్తుంది. శరీరం జింక్‌ను నిల్వచేసుకోదు. అందుకే జింక్‌ లభించే ఆహారాన్ని రోజూ తినాలి. మగవారికి రోజూ 11 మిల్లీగ్రాముల జింక్ అవసరం అయితే, మహిళలకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరం. అదే గర్భిణిలు, తల్లిపాలు ఇచ్చే మహిళలకు మాత్రం 12 మిల్లీ గ్రాములు అవసరం పడుతుంది. జింక్ లోపిస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జింక్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. 


గాయాలు నయం కావు
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, గాయాలైనప్పుడు రక్తం అధికంగా పోకుండా గడ్డం కట్టేలా చేసేందుకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం ఏర్పడినప్పుడు గాయాలు తగిలినా అవి త్వరగా నయం కావు. అంతేకాదు ముఖంపై మొటిమలు వస్తాయి. 


బరువు తగ్గుతారు
జింక్ లోపం వల్ల ఆకలిలో మార్పులు వస్తాయి. ఆకలి తక్కువ వేస్తుంది. ఆహారం తినాలనిపించదు. ఫలితంగా బరువు తగ్గిపోతారు. ఇలా పోషకాల లోపం వల్ల బరువు తగ్గడం అనేక ఆరోగ్యసమస్యలు ఉత్పన్నమవుతాయి. 


జుట్టు రాలిపోతుంది
ఈ పోషకలోపం వల్ల జుట్టు చిట్లడం, రాలడం అధికమవుతుంది. అకారణంగా జుట్టు అధికంగా రాలుతున్నా, జుట్టు పలుచబడుతున్నా జింక్ లోపమేమో అనుమానించాలి. ఒత్తిడి కూడా జుట్టురాలడానికి కారణమవుతుంది. 


తరచూ జలుబు
జింక్ తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాని వల్ల తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువ. తరచూ మీకు జలుబు చేస్తున్నా, అనారోగ్యం బారిన పడుతున్నా జింక్ లోపం ఉందేమో చూసుకోవాలి. జింక్ తగినంత అందితే జలుబు త్వరగా తగ్గుతుంది. 


చూపు మసకగా మారడం
ఆరోగ్యకరమైన చూపుకు జింక్ చాలా అవసరం. శరీరానికి తగినంత జింక్ అందనప్పుడు దృష్టి మారుతుంది. మసకగా కనిపిస్తుంది. అస్పష్టంగా అనిపిస్తుంది. జింక్, విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చూపును ఇస్తాయి. 


గందరగోళం
మీకు మనసు, ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయా? అయితే జింక్ లోపం ఉందేమో చూసుకోండి. జింక్ తగినంత అందకపోతే మెదడు సరిగా పనిచేయదు. పనిపై ఏకాగ్రత్ కుదరదు. జ్ఞాపకశక్తి సమస్యలకు కూడా తలెత్తుతాయి.  


Also read: ప్రపంచంలో పరమ బోరింగ్ ఉద్యోగాలు ఇవే, పరిశోధనలో తేల్చిచెప్పిన సైకాలజిస్టులు



Also read: రోజూ పాలు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?


Also read: షాకింగ్ ఆవిష్కరణ, మనుషుల హార్ట్ బీట్‌ను వినగలిగే ఫ్యాబ్రిక్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు