Naveen Body Reached Karnataka from Ukraine: ఉక్రెయిన్‌లో రష్యా దాడుల్లో చనిపోయిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం నేటి (సోమవారం) తెల్లవారుజామున మూడు గంటలకు కర్ణాటకకు చేరుకుంది. దాదాపు మూడు వారాల కిందట ఉక్రెయిన్‌లో నవీన్ చనిపోగా, భారత్‌కు తీసుకురావడానికి ఇన్ని రోజులు పట్టింది. నేటి ఉదయం బెంగళూరులోని కెంపే గౌడ ఎయిర్‌పోర్టుకు నవీన్ పార్థివదేహం చేరుకోగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై నివాళులు అర్పించారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లిన నవీన్ దురదృష్టవశాత్తూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోయాడు.
మెడికల్ కాలేజీకి డెడ్‌బాడీ..
ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న నవీన్ ఖార్కీవ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. ఈ క్రమంలో రష్యా జరిపిన బాంబు దాడులు, పేలుళ్లలో మార్చి 1న కర్ణాటకకు చెందిన నవీన్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఎలాగైనా సరే నవీన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్ అధికారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ, అధికారులు మాట్లాడి నవీన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని దేవనాగరెలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని నవీన్ కుటుంబం కొన్ని రోజుల కిందట నిర్ణయం తీసుకుంది.
ప్రధానికి కర్ణాటక సీఎం కృతజ్ఞతలు
ఉక్రెయిన్ నుంచి నవీన్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించడంలో సహాయం చేసినందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో కర్ణాటక ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ఈ విషయంపై చర్చించింది. తమకు త్రివర్ణ పతాకం బిల్డింగ్ మీద ఉంచాలని, అదే మీకు శ్రీరామరక్ష అని అధికారులు సూచించినట్లు నవీన్ చనిపోయే ఒకట్రెండు రోజుల ముందు తండ్రి అతడికి సూచించారు. కానీ జరగరాని నష్టం జరిగిపోయింది.