Russia-Ukraine Conflict: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. రష్యా తాజాగా హైపర్ సోనిక్ రాకెట్లు(Russia Hyper sonic rockets) ప్రయోగిస్తుంది. ఈ ఉద్రిక్తల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin)తో "చర్చలకు సిద్ధంగా ఉన్నానని" పేర్కొన్నారు. అయితే అలా ఈ చర్చలు విఫలమైతే మాత్రం "మూడో ప్రపంచ యుద్ధం" వస్తుందని జెలెన్ స్కీ అన్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది. "నేను పుతిన్ తో చర్చలకు సిద్ధంగా ఉన్నాను. గత రెండేళ్లుగా నేను సిద్ధంగా ఉన్నాను. చర్చలు లేకుండా మనం ఈ యుద్ధాన్ని ముగించలేమని నేను భావిస్తున్నాను" అని జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారని CNN తన రిపోర్టులో పేర్కొంది. "పుతిన్‌తో చర్చలు జరిపే అవకాశం, మాట్లాడే అవకాశం కోసం మనం ఏదైనా ఫార్మాట్‌ను ఉపయోగించాలని నేను భావిస్తున్నాను. కానీ ఈ ప్రయత్నాలు విఫలమైతే, అది మూడో ప్రపంచ యుద్ధం అని అర్థం" అన్నారాయన.
రష్యాకు తీవ్ర నష్టం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నాల్గో వారంలోకి ప్రవేశించింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తదుపరి చర్చలపై మాట్లాడారు. శనివారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో జెలెన్ స్కీ చర్చలను ప్రస్తావించారు. చర్చలు వైఫల్యం రష్యాకు "తీవ్ర నష్టాలు" కలిగిస్తుందని హెచ్చరించారు. "మేము చర్చల కోసం పట్టుబట్టాం. శాంతి కోసం పరిష్కారాలను అన్వేషిస్తున్నాం. చర్చలపై ప్రతి ఒక్కరూ నా మాట వినాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మాస్కోతో మాట్లాడటానికి సమయం వచ్చింది. ఇది ప్రాదేశిక సమగ్రత, న్యాయాన్ని పునరుద్ధరించడానికి సమయం." అని జెలెన్ స్కీ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదం
ఉక్రెయిన్(Ukraine)పై రష్యా దాడి ప్రారంభానికి నెల క్రితం 6.5 మిలియన్ల ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలయ్యాక భద్రతా సమస్యల కారణంగా మరో 3.2 మిలియన్లు దేశం విడిచి వెళ్లారు. కీవ్‌ను విడిచి వెళ్లాలని అమెరికా జెలెన్ స్కీని కోరినప్పటికీ ఆ ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా దాడికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడటానికి, దేశానికి సహాయం చేయడానికి చాలా మంది సాధారణ పౌరులు సైన్యంలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.