మణిపుర్ సస్పెన్స్ కొలిక్కి వచ్చింది. మణిపూర్ తాత్కాలిక ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్‌కే రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తున్నట్లు భాజపా ప్రకటించింది. 







ఏకగ్రీవంగా


ఆదివారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో రాష్ట్ర సీఎంగా బిరేన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెనువెంటనే బిరేన్ సింగ్‌కు భాజపా కేంద్ర పరిశీలకులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, భాజపా ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు. ఈశాన్య రాష్ట్రల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కేంద్రమంత్రులు అన్నారు.


ముగ్గురి మధ్య


బిరేన్‌ సింగ్‌తో పాటు సీఎం పోస్టుకు బిస్వాజిత్‌ సింగ్‌, ఆర్‌ఎస్‌ఎస్ బలపరిచిన యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ పేర్లను అధిష్టానం పరిశీలించింది. నిన్నటి వరకు బిరేన్‌, బిస్వాజిత్‌, ఖేమ్‌చంద్‌లతో భాజపా కీలక నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం వాళ్లంతా తిరిగి మణిపూర్‌కు చేరుకోగా.. ఆ వెంటనే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, కిరణ్ రిజిజులు రాజధాని ఇంపాల్‌కు క్యూ కట్టారు. కానీ అధిష్ఠానం మాత్రం బిరేన్ సింగ్‌పైనే నమ్మకముంచింది.


ఆయనే సీనియర్


నిజానికి బిస్వాజిత్‌ సింగ్‌.. బిరేన్‌ సింగ్‌ కంటే సీనియర్‌. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు. 2017లోనే ఆయన సీఎం అవుతారని అంతా భావించారు. కానీ, అది జరగలేదు.


భాజపా గెలుపు


మొత్తం 60 సీట్లున్న మణిపుర్‌ అసెంబ్లీలో 32 సీట్లు గెల్చుకుని భాజపా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మణిపుర్‌ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతోనే ముగియగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బిరేన్‌ సింగ్‌ కొనసాగుతున్నారు. ఆయన త్వరలోనే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.