చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు, రొయ్యలు, పీతలు చాలా ఆరోగ్యకరమైనవి. కానీ కొందరికి పడవు. తమకు పడతాయో పడవో తెలియక కొంతమంది వాటిని తిని తరువాత ఆరోగ్యసమస్యలు తెచ్చుకుంటారు. సీఫుడ్ తిన్నాక కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వాటిని తినకూడదు. ఈ లక్షణాలు దాదాపు వెంటనే కనిపిస్తాయి. కొన్ని మాత్రం ఆలస్యంగా బయటపెడతాయి. సరిగా వండని సీఫుడ్ తినడం వల్ల మాత్రం తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరాన్నజీవులు రక్తంలో చేరి అనారోగ్యాలకు కారణం కావచ్చు. అందుకే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి బాగా వండాకే తినాలి.
సీఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి?
చాలా మందికి సీఫుడ్ అలెర్జీ అంటే ఏమిటో అర్థం కాదు. సముద్ర జీవులైన చేపలు, రొయ్యలు, పీతల్లాంటివి తినడం వల్ల అందులోని ప్రోటీన్లు మన శరీరంలో చేరాక రోగనిరోధక వ్యవస్థ వైవిధ్యంగా స్పందిస్తుంది. అప్పుడు శరీరం ఆ లక్షణాలను ఏదో ఒక రూపంలో బయటపెడుతంది. అందరికీ ఇలా జరగాలని లేదు. చాలా మందికి సముద్రపు చేపలు పడతాయి. కానీ కొందరిలో రోగనిరోధక వ్యవస్థ తట్టుకోలేదు. దీన్నే అలెర్జీ అంటారు.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే...
ఈ లక్షణాలు సీఫుడ్ తిన్న నిమిషాల్లోనే కనిపిస్తాయి.
1.శరీరం దురద పెడుతుంది.
2. చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి.
3. ముక్కు దిబ్బడ కడుతుంది.
4. పెదవులు, ముఖం, నాలుక, గొంతుపై వాపు వస్తుంది.
5. గురక, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది.
6. దగ్గు రావడం, ఉక్కిరిబిక్కిరి అవ్వడం జరుగుతుంది.
7. పొత్తికడుపులో నొప్పి వస్తుంది.
8. వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి.
9.తల తిరగడం మూర్ఛపోవడం కూడా జరుగుతుంది.
అన్నింట్లోకి ప్రాణాంతకమైనది అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలెర్జీ. ఇది వస్తే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయాలి.
ఎక్కువగా షెల్ఫిష్ లు ఇలా అలెర్జీలకు కారణం అవుతాయి. అంటే పీతలు, రొయ్యలు వంటి షెల్ ఉన్న జీవులు. ఎక్కువగా ఇవే అలెర్జీలను కలుగజేస్తాయి.ఈ అలెర్జీకి ఎటువంటి నివారణ లేదు. కాబట్టి ఈ అలెర్జీలు మీకుంటే రొయ్యలు, పీతలు ఆహారాలను తినకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
సీఫుడ్ తిన్నాక మీకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే వాటిని హ్యాపీగా తినవచ్చు. కచ్చితంగా తినాలి కూడా. ఎందుకంటే చేపలు, రొయ్యలు, పీతల్లాంటివి ఎంత తిన్నా పెద్దగా బరువు పెరగరు. పైగా అందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది.
Also read: ప్రపంచంలో భయపెట్టే బొమ్మ ఇదే - దీని గురించి తెలిస్తే బొమ్మలు కొనడానికే భయపడతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.