‘అమ్మో బొమ్మ’ అనే తెలుగు సినిమా చాలా ఏళ్ల క్రితం వచ్చింది. అందులో ఒక బొమ్మ రాత్రయ్యే సరికి భయపెడుతూ ఉంటుంది. అది కేవలం సినిమానే.  అలా భయపెట్టే బొమ్మ అమెరికాలో ఒకటుందని చెప్పుకుంటారు. ఆ బొమ్మ ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ‘ఈస్ట్ మార్టెల్లో మ్యూజియం’లో ఉంది. దీన్ని చూడటానికి వేలాదిగా వస్తుంటారు ప్రజలు. ఎందుకోగాని ఆ బొమ్మను చూసి మాత్రం భయపడుతుంటారు. ఆ బొమ్మను‘రాబర్ట్ డాల్’ అంటారు. ఇదొక హాంటెడ్ డాల్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బొమ్మ కారు ప్రమాదాల నుంచి విడాకుల వరకు అనేక సంఘటనలకు కారణమైందని అంటారు. 


బొమ్మ కథ ఇదే...
అమెరికాకు చెందిన పెయింటర్ రాబర్ట్ యూజీన్ ఒట్టో. అతని తాత జర్మనీ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఈ బొమ్మను 1904లో కొని మనవడైన రాబర్ట్ కు ఇచ్చాడు. ఏ ముహూర్తంలో ఇచ్చాడో తెలియదు కానీ రాబర్ట్‌కు ఆ బొమ్మే లోకమైంది. ఆ బొమ్మకు తగ్గట్టు ఇంట్లో కూడా మార్పులు చేర్పులు చేయించాడు. ఇంట్లో సభ్యుడిలా దాన్ని చూసేవాడు. 1930 రాబర్ట్ కు పెళ్లయింది. తన గదిలోనే ఆ బొమ్మను ఉంచుకునేవాడు. ఆయన భార్యకు మాత్రం ఆ బొమ్మ అంటే పరమ చిరాకు. 


అయితే చుట్టుపక్కల నివసించే వారు, ఇంట్లో పనిచేసేవారు, ఇంటిలోని ఇతర పెద్దలు మాత్రం బొమ్మ ఏదో తేడాగా ఉందని గమనించారు. బొమ్మ స్వయంగా కదలడం, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ముఖ కవళికలు మార్చడం వంటివి గమనించారు. కానీ ఆ విషయాలను రాబర్ట్ నమ్మేవాడు కాదు. ఆ  బొమ్మను చూసి చుట్టుపక్కల వాళ్లు చాలా భయపడేవారు. 1974లో రాబర్ట్ మరణించాడు. ఆ తరువాత రెండేళ్లకు అతని భార్య కూడా మరణించింది. ఆ తరువాత మిర్టిల్ రాయిటర్ అనే మహిళ ఆ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ బొమ్మను కూడా తనతో పాటూ 20 ఏళ్లు ఉంచుకుంది. అప్పుడు కూడా చాలా మంది ఆ బొమ్మ ముసిముసిగా నవ్వడం, కదలడం గమనించారు. 


అమెరికన్లు నమ్మే పురాణాల ప్రకారం బొమ్మలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఆ శక్తితోనే అవి కదలడం, ముఖ కవళికలు మార్చడం, ముసిముసిగా నవ్వడం వంటివి చేస్తుంటాయి.ఈ బొమ్మలో కూడా అలాంటి శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు ప్రజలు. అంతేకాదు రాబర్ట్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు బహామని జాతికి చెందిన ఓ యువతే ఈ బొమ్మను ఆయన దగ్గరకు చేరేలా చేసిందని కూడా చెబుతుంటారు. అయితే ఈ బొమ్మ ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఏదో ఒక చెడు జరుగుతూ ఉంటుందని కూడా చెబుతుంటారు. అంటే ప్రమాదాలు, మనుషులు విడిపోవడం, భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం, లేదా వారి వంశం వృద్ధి కాకపోవడం వంటివి జరుగుతాయని చెబుతారు. అందుకే రాబర్ట్ కుటుంబంలో ఎవరూ లేరని చెప్పుకుంటారు. 


ప్రస్తుతం ఎక్కడ?
ఈ బొమ్మని చివరికి ఫ్లోరిడాలోని మ్యూజియంకు ఇచ్చేశారు. దాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. గడ్డితో నిండిన ఆ బొమ్మను అన్ని వస్తువులతో పాటూ జాగ్రత్తగా చూసుకుంటారు క్యురేటర్లు. ఆ బొమ్మను సంరక్షిస్తున్న వ్యక్తి మాట్లాడుతూ ‘ఆ బొమ్మ గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ నాకు ఇంత వరకు దానితో ఎలాంటి చేదు అనుభవం ఎదురవ్వలేదు. నా ఉద్యోగం నేను చేస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. 


సినిమాలు...
ఈ బొమ్మ కథను ఆధారంగా చేసుకుని ఇప్పటికీ నాలుగు సినిమాలు వచ్చాయి. 2016లో మొదటి సినిమా వచ్చింది. దాని పేరు ‘ద కర్స్ ఆఫ్ రాబర్ట్ ద డాల్’. 2019లో ‘రాబర్ట్ రిటర్న్’ అనే సినిమా వచ్చింది. 


Also read: తలుపుకు గులాబీ రంగు వేయడమే పాపమైంది, లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది