‘‘మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం’’ - ఆది శంకరాచార్యులు (నిర్వాణషట్కం)
దీనికి అర్థం.. నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను, చిత్తమునూ కాను, నేను చెవులనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము అయిన నాసికనూ కాను, నేను చక్షురింద్రియమైన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, భూమినీ కాను, తేజస్సునూ కాను, వాయువునూ కాను, నేను చిదానంద రూపుడైనటువంటి శివుడను నేను అని భావం.
శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివ స్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. సర్వవ్యాపకుడు, సర్వమునకు మూలకారణమైనవాడు శివుడు. శివుణ్ణి నిరాకారిగాను, సాకారిగాను ఆరాధిస్తారు. శివుని సాకార స్వరూపమే లింగము. లింగము అంటే చిహ్నం అని అర్థం. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపుకు దారిచూపేదే శివలింగం.
నిర్గుణ స్వరూపానికి, నిరాకారానికి, నిత్య సనాతనానికి నిర్వచనం శివుడు. శివశంకరా...భోలేనాథ..కైలాసపతి ఇలా ఎన్నో పేర్లు. కానీ ఈ పేర్లకు అర్థాన్ని తెలుసుకోవాలంటే మాత్రం శివతత్త్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిందే. మనిషి ఇంద్రియలోలుడు. అందుకే దేనికైనా సరే ఒక రూపాన్ని, ఆకృతిని కల్పించి సాకార రూపకంగా ఆరాధన చేసుకుంటాడు. మనం పుట్టినప్పటి నుంచి అనేక ఆకారాలు, రూపాలను మనం చూస్తూ ఉంటాం కాబట్టి నిర్గుణ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అత్యంత అవసరం. అంతిమ సత్యాన్ని మనిషి గ్రహించగలగాలి.. మరి ఆ నిర్గుణ తత్త్వాన్ని పొందాలంటే శివుడు నిరాకారుడిగా ఆరాదించగలగాలి. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే భావాన్ని గ్రహించగలగాలి.
ఓం నమ: శివాయ అని జపిస్తే చాలు సూక్ష్మంలో మోక్షాన్ని కల్పించేవాడు శివుడు. శివతత్వం చెప్పేది నిరాడంబరత. అందుకే యోగి మహాదేవుడిలాగా ఆయన మనకు కనిపిస్తాడు. మానవులమైన మనం ఈ భవ బంధాలు, ఆశలు, కోరికలకు అతీతంగా జీవించలేకపోవచ్చు కానీ ఆయన తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే ఆ నిరాడంబరతను తెలుసుకొని ఆచరిస్తే దానిలో నుంచే ఆత్మానందాన్ని పొందవచ్చు. దీనివల్ల ఆత్మశుద్ధి లభిస్తుంది. ఆత్మశుద్దే మోక్షమార్గానికి సాధనం.
నిరాకారుడైన శివుడి గురించి తెలుసుకుంటే ఆయనకి ఊహల ద్వార రూపం ఇవ్వలేం. చిత్రాల ద్వారా, విగ్రహాల ద్వారా ఆయన స్వరూపాన్ని గురించి వర్ణించలేం. ఆయన స్వరూపం ఏంటో అప్పుడు మన మనస్సు మాత్రమే చెప్పగలదు. ఆయన ఈ సమస్త జగత్తును నడిపించే శక్తి అని తెలుస్తుంది. శక్తి అంటే శివుడిలో ఉన్న యోగమాయ. శక్తి, శివుడిని వేరుచేయలేం. ఆ భావనని పొందాలంటే మనసును శివునిపై ఉంచి ధ్యానం చేయగలగాలి. అందుకు నిరంతర సాధన చేయాలి
శివుని గురించి తెలుసుకోవాలంటే ముందుగా శక్తిని హృదయంలో ఒక బిందువు రూపంలో ఏర్పరుచుకోవాలి.. క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ సాధన చేస్తూ కఠినతరం చేయాలి. అలా శక్తి విశాలమైతే ఆ విస్తీర్ణం మధ్యలో కూర్చున్న బిందువే శివుడు. అలా ఆ శక్తి, శివుడు కలిపి అర్థనారీశ్వరుడు అనే భావన మనకు వికసిస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సాధకులందరూ ఈ సృష్టి మొత్తం శివలింగమే అంటారు. ఎలా అంటే వృత్తానికి కేంద్రం ఒక్కటే ఉంటుంది. అది ఎంత పెరిగినా కేంద్రం ఒక్కటే కదా...ఆ కేంద్రమే శివలింగం. ఆ చుట్టూ ఉన్న వృత్తమే శక్తి. అదే అర్థనారీశ్వర తత్వం. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దేనిలోనికి అంతా లయమై కలిసి పోతున్నదో అదే శివతత్వం. దీన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఇది తెలుసుకోవడమే మానవ జీవిత పరమార్థం.
Also Read: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు