కొంతమంది యూరిన్ పోసినా పెద్దగా వాసన రాదు. మరి కొంతమంది మాత్రం యూరిన్ పోస్తే చాలా దూరం వరకు దుర్వాసన వచ్చేస్తుంది. ఊపిరి పీల్చుకోలేనంతగా చెడు వాసన వస్తుంది. బాత్రూం మొత్తం దుర్వాసనతో నిండిపోతుంది. సాధారణంగా మూత్రం రంగు లేత పసుపు రంగు ఉంటుంది. కాస్త వాసన కూడా ఉంటుంది. అయితే మూత్రం రంగు ముదురుగా మారడంతో పాటు, భయంకరంగా దుర్వాసన వస్తుంటే మాత్రం దానికి కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు కారణమని చెప్పుకోవచ్చు. అలాగే ఇలా విపరీతమైన దుర్వాసనతో పాటు, మూత్రం రంగు మారితే వైద్యులను సంప్రదించడం కూడా చాలా ముఖ్యం.
సాధారణంగా కాఫీ వంటివి తాగడం వల్ల మూత్రం అసహ్యకరమైన వాసన వస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్లే ఇలా బలమైన వాసన వస్తుందని అంటారు. అలాగే కాఫీలో ఉండే ఒక రకమైన సమ్మేళనం కూడా మూత్రానికి బలమైన దుర్వాసనను అందిస్తుంది. టిఫిన్ వల్ల అధికంగా మూత్రం ఉత్పత్తి అవుతుంది. శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. ఇది కూడా ఆ దుర్వాసనకి కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి కాఫీని రోజుకు ఒకసారి మాత్రమే తాగండి. దొరికినప్పుడల్లా తాగితే ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
వెల్లుల్లి, ఉల్లి అధికంగా వేసిన ఆహారాలను కూడా తినడం తగ్గించాలి. ఈ రెండింటిలో కూడా సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. అవి మూత్రాన్ని కలుషితం చేస్తాయి. కుళ్ళిన క్యాబేజీ లేదా కుళ్ళిన గుడ్లు నుంచి వచ్చే వాసనలాగా మూత్రం కూడా దుర్వాసన వేస్తుంది. కాబట్టి వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడాన్ని తగ్గించండి.
జీలకర్ర, పసుపు, కొత్తిమీర వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ అధికంగా తింటే మాత్రం దుర్వాసనకు కారణం అవుతాయి. ఎందుకంటే ఇవి శరీరంలోకి వెళ్ళాక... వాటికి వాసనను అందించే సమ్మేళనాలు విచ్ఛిన్నమవుతాయి. అవి ఆహారంలో జీర్ణమైన తరువాత కూడా మూత్రంలో ఆ వాసన మాత్రం ఉండిపోతుంది. అక్కడ అనేక మార్పులకు గురైన ఆ వాసన బయటికి వచ్చాక దుర్వాసనగా మారిపోతుంది.
దుర్వాసనతో కూడిన మూత్ర విసర్జన వల్ల ప్రతిసారి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దుర్వాసనతో కూడిన మూత్ర విసర్జనతో పాటు నొప్పి ఇన్ఫెక్షన్లు వంటివి అనిపిస్తే మాత్రం వైద్యుల్ని కలవాలి. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నవారు, మూత్రం రంగు తేడాగా ఉన్నవారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టైప్ 2 మధుమేహం బారిన పడినవారు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా దుర్వాసన వచ్చే మూత్రాన్ని విసర్జిస్తారు. కాబట్టి మూత్రం దుర్వాసన వస్తుంటే తేలికగా తీసుకోకుండా వైద్యులను సంప్రదించండి.
Also read: చల్లని వాతావరణంలో చికెన్ సూప్ తింటే ఆ మజాయే వేరు
Also read: వానాకాలంలో కీళ్ల నొప్పులు పెరిగిపోతాయెందుకు? వాటిని ఇలా తగ్గించుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.