వాతావరణం మారిందంటే చాలు అంటు రోగాలు, ఫ్లూ, జలుబు, దగ్గు వంటివి రావడానికి సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా వాతావరణం చల్లబడుతున్న కొద్దీ రోగాలు వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచే, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని ఇచ్చే పోషకాలు మన శరీరానికి అవసరం పడతాయి. ఒకవైపు శక్తిని ఇస్తూనే, మరోవైపు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే సత్తువను కూడా వ్యాధినిరోధక వ్యవస్థకు ఇవ్వాలి. అలాంటి వాటిల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. దీన్ని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు... అంటే వానాకాలంలో, శీతాకాలంలో సాయంత్రం పూట చేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చికెన్ సూప్ ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.


కావాల్సిన ప‌దార్థాలు
ఎముకల్లేని చికెన్ - పావుకిలో
పాలకూర - ఒక కట్ట
మిరియాల పొడి - చిటికెడు
ఉల్లికాడలు - రెండు
బీన్స్ - మూడు
వెల్లుల్లి రెబ్బలు - మూడు
క్యారెట్ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
కార్న్ ఫ్లోర్ - అర స్పూను
నూనె - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా 


తయారీ ఇలా
ఎముకలు లేని చికెన్‌ను తీసి శుభ్రం చేసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలా అయితే చికెన్ బాగా ఉడుకుతుంది. ఒక గిన్నెలో చికెన్, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించాలి. దాదాపు చికెన్ మొత్తం ఉడికిపోవాలి. తరువాత గిన్నెతో పాటు ఆ చికెన్‌ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి తరిగిన క్యారెట్, తరిగిన బీన్స్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత గిన్నెలోని చికెన్ ముక్కలను తీసి కళాయిలో వేసి వేయించాలి. ఉప్పు, పాలకూర తరుగు, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, ఉల్లికాడల తరుగు కూడా వేసి బాగా కలపాలి. ఓ పది నిమిషాలు అలా ఉడికించాక చికెన్‌ను ఉడికించిన నీటిని కూడా వేసేయాలి. దీన్ని వేడిగానే ఉన్నప్పుడు తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పిల్లల చేత కూడా ఈ సూపును తాగించడం చాలా ముఖ్యం. ముసలి వారికి కూడా ఈ సూప్ నచ్చుతుంది.


గొంతు నొప్పి వేధిస్తున్నప్పుడు చికెన్ సూప్ తాగాలి. ఇది మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. టీ, కాఫీలు మానేసి చికెన్ సూప్ ప్రయత్నించండి. సూప్ తాగుతూ ఉంటే గొంతులో హాయిగా అనిపిస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది.  చికెన్ నూనెలో వేయించి తినేకన్నా, ఇలా నీటిలో ఉడికించి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది చాలా సులువుగా జీర్ణం అవుతుంది. ఇలా చికెన్ సూప్ తాగడం వల్ల బరువు కూడా పెరగరు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట నిండిన భావనను అందిస్తుంది. దీనిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. 


Also read: వానాకాలంలో కీళ్ల నొప్పులు పెరిగిపోతాయెందుకు? వాటిని ఇలా తగ్గించుకోండి


Also read: తన కలలను కంట్రోల్ చేద్దామని, తన పుర్రెకు తానే రంధ్రం పెట్టుకున్న సైంటిస్ట్