అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ఆకర్శించేందుకు, ఓటర్లను బీఆర్‌ఎస్ వైపు తిప్పుకునేలా మేనిఫెస్టోలో సరికొత్త పథకాలు పొందుపరిచే పనిలో పడ్డారు. 


ఇప్పటికే తెలంగాణలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దృష్టి సారించని, రంగాలు, వర్గాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందని వర్గాల కోసం ప్రత్యేకంగా పథకాలు ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని వివిధ పార్టీల మేనిఫెస్టోలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు ఆయా పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇప్పటి వరకూ కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ కింద ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద మరింత మందికి ప్రయోజకం కలిగించేలా మార్పులు, సాయం మొత్తాన్ని పెంచే ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ తన 'బ్రహ్మాస్త్ర' పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీటి గురించి ఇప్పటికే పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. సరైన సమయంలో సరికొత్త పథకాలను ఆవిష్కరించనున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల సమయంలో పథకాలు వెల్లడించనున్నారు. ఆగస్టులో బీఆర్ఎస్ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించే అవకాశం ఉందని బీఆర్ఎస్‌ పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందన్నారు.


వృద్ధులు, వితంతువులకు 2,016 నుంచి 3,016 ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు. వీటిని పెంచేందుకు BRS అధినేత ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వికలాంగుల పింఛన్ 3,016 నుంచి 4,016కు పెంచారు. అలాగే పింఛనుదారుల వయస్సును 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు.


ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూనే, మరికొన్ని పథకాల రూపకల్పనపై బీఆర్‌ఎస్ దృష్టి సారిస్తోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు బంధు పథకాలను ప్రకటించారు.  ఐదేళ్ల క్రితం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఈ పథకాలు దోహదపడ్డాయి. తాజాగా ఈ సారి ఎన్నికల్లో సైతం గెలిచేందుకు, ప్రజలను ఆకర్శించడానికి ప్రభుత్వం పథకాలు రచిస్తోంది. 


BRS ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు సంవత్సరానికి సుమారు రూ.60,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రజలకు చెప్పిన వాటి కంటే ఎక్కువగా దళిత బంధు, ఇతర డజను పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేసీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతకైనా సిద్ధంగా ఉందన్నారు.


కేంద్రం కొన్ని తెలంగాణ పథకాలను ఉచితాలుగా విమర్శించినా, చాలా రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ పథకాలను అనుకరిస్తున్నాయని, రైతుబంధు, 24x7 ఉచిత విద్యుత్ అమలు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. జనతాదళ్ (సెక్యులర్) వంటి పార్టీలు కర్ణాటక ఎన్నికల్లో తమ మేనిఫెస్టోల్లో రైతు బంధు వంటి పథకాలను కూడా చేర్చాయని ఆయన గుర్తు చేశారు.