ఆర్థరైటిస్ ఉన్నవారికి చల్లని వాతావరణం పడకపోవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో వీరికి కీళ్లనొప్పులు ఎక్కువైపోతుంటాయి. దీనికి కారణం ఏంటో స్పష్టంగా ఇంతవరకు తెలియలేదు. కానీ వానాకాలం వచ్చిందంటే మాత్రం కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు చాలా బాధిస్తాయి. దీనికి కారణం ఏమిటని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులే ఇలా కీళ్ల నొప్పులకు కారణమని చెప్పేవారు ఉన్నారు. వర్షం పడడానికి ముందు వాతావరణంలో గాలి పీడనం తగ్గిపోతుంది. శరీరం మీద గాలి పీడనం తక్కువగానే ఉంటుంది. దీనివల్లే కండరాలు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాలు వ్యాకోచిస్తాయి. దీంతో కీళ్ళ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల కీళ్ల నొప్పులు వస్తాయని అనుకుంటున్నారు ఆరోగ్య నిపుణులు.  వానలు తగ్గాక వాతావరణంలో గాలిపీడనం మళ్లీ పెరుగుతుంది. అప్పుడు నొప్పులు తగ్గిపోతాయి. అలాగే మరిన్ని కారణాలు కూడా కీళ్ల నొప్పులు పెరగడానికి కారణం అయి ఉండొచ్చు. వానలు పడుతున్నప్పుడు వాతావరణం విపరీతంగా చల్లబడిపోతుంది. ఒకచోట ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. దీనివల్ల కండరాలు, కీళ్లు బిగుసుకుపోయి ఇలా నొప్పి పెరగవచ్చు. కొంతమందిలో వాతావరణం చల్లబడుతున్న కొద్ది, వానలు మొదలవుతున్న కొద్దీ నొప్పులు వస్తాయని భావన కలుగుతుంది. ఆ భావన పెరిగి అలా నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది.


వానాకాలంలో కీళ్ల నొప్పులు బాధించకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లోనే వ్యాయామం చేయాలి. దీనివల్ల కీళ్ల మీద పడే ఒత్తిడి తగ్గుతుంది. ఒకే దగ్గర కూర్చోవడం మంచి పద్ధతి కాదు. ఇంట్లోనే వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. బరువు పెరిగితే కీళ్లపై విపరీతమైన భారం పడుతుంది. దీని వల్ల కూడా నొప్పులు పెరుగుతాయి. కాబట్టి అధిక బరువును తగ్గించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. గోరువెచ్చటి నీటిలో క్లాత్ ను ముంచి నొప్పి ఉన్నచోట మర్దన చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో నీరు తగ్గినా కూడా కీళ్ల కదిలికలు తగ్గిపోతాయి. కాబట్టి వానాకాలం అయినా శీతాకాలమైనా శరీరానికి అవసరమైనంత నీటిని తాగుతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల వానాకాలంలో కూడా కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. 


కీళ్ల నొప్పులు అధికంగా బాధిస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండిపోకూడదు. వైద్యుడిని తప్పకుండా కలవాలి. వాపు రావడం, కీళ్ల ప్రాంతం ఎర్రగా మారడం, తీవ్రమైన నొప్పి పెట్టడం, రెండు కీళ్లు తీవ్రంగా బాధపెట్టడం వంటివి జరిగితే వైద్యులను సంప్రదించాల్సిందే. వైద్యులు కొన్ని రకాల మందుల ద్వారా నొప్పులను తగ్గిస్తారు. వానాకాలంలో హీటింగ్ ప్యాడ్‌ను ఉపయోగించి కీళ్ల చుట్టూ మర్ధనా చేసుకుంటూ ఉండాలి. 


Also read: తన కలలను కంట్రోల్ చేద్దామని, తన పుర్రెకు తానే రంధ్రం పెట్టుకున్న సైంటిస్ట్






Also read: గుండె ఆరోగ్యానికి పిండి, ఈ ఐదు రకాల పిండిని ప్రయత్నించండి



























































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.