IND vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు ఆసక్తిగా మారింది. టీమిండియా విజయం సాధించాలంటే ఆఖరి రోజు ఎనిమిది వికెట్లు తీయాలి. అదే విండీస్‌ విజయం సాధించాలంటే మాత్రం 289 పరుగులు చేయాలి. సో ఐదో రోజు ఆట మరింత ఇంట్రస్టింగ్‌గా మారింది. 
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ స్కోరు 76 పరుగులు చేసి  2 వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి విండీస్ 365 పరుగుల విజయ లక్ష్యంతో తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది. ఆ టీం విజయం సాధించాలంటే ఇంకా 289 పరుగులు చేయాల్సి ఉంది. టీమ్ఇండియా గెలవాలంటే 8 వికెట్లు తీయాలి. అంతకుముందు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు సాధించారు.


విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్‌, కిర్క్ మెకంజీ ఔటయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ దారి పట్టించాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ 52 బంతుల్లో 28 పరుగులు చేశాడు. కిర్క్ మెకంజీ పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. అదే సమయంలో విండీస్ తరఫున నాలుగో రోజు ఆట ముగిసేసరికి చంద్రపాల్, జెర్మైన్ బ్లాక్‌వుడ్ క్రీజ్‌లో ఉన్నారు. చంద్రపాల్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు. జెర్మైన్ బ్లాక్ వుడ్ 20 పరుగులతో ఆడుతున్నాడు. 


రెండో ఇన్నింగ్స్‌లో ఏం జరిగింది?
అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2/181 వద్ద డిక్లేర్ చేసి విండీస్‌కు 365 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో  50లు చేశారు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో షానన్ గాబ్రియేల్, జోమెల్ వారికాన్ జోడీ చెరో వికెట్ తీశారు. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 పరుగులకే టీమిండియా ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగుల ఆధిక్యం వచ్చింది. భారత బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్ చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ ఐదుగురు ఆటగాళ్లను అవుట్ చేశాడు.  ముకేష్ కుమార్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.


తర్వాత రెండో ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన టీమిండియా చాలా ధాటిగా ఆడింది. వర్షం పడే అవకాశం ఉండటంతో టీమిండియా బ్యాటర్లు మొదటి బంతి నుంచే చెలరేగి బ్యాటింగ్ చేశారు. కీమర్ రోచ్ వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ (38: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) సిక్సర్, ఫోర్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఓపెనర్లు ఎక్కడా తగ్గలేదు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనే రోహిత్ శర్మ (57: 44 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్లు త్వరగానే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన శుబ్‌మన్‌గిల్‌, ఇషాన్ కిషన్‌ కూడా అదే టెంపో కొనసాగించారు. 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి డిక్లర్‌ చేసింది.