భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు నాలుగో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో ప్రస్తుతానికి ఆట ఆగింది. వెస్టిండీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 15 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఆటంకం కలిగించకుండా ఉంటే భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (8 బ్యాటింగ్: 7 బంతుల్లో, ఒక ఫోర్), శుభ్‌మన్ గిల్ (10: 10 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
వెస్టిండీస్ టపటపా...
229/5 ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన వెస్టిండీస్ వరుస ఓవర్లలో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఆలిక్ అథనజ్‌ను (37: 115 బంతుల్లో, మూడు ఫోర్లు) అవుట్ చేసి మొదటి ఓవర్లోనే ముకేష్ భారత్‌కు వికెట్ అందించాడు. అక్కడి నుంచి సిరాజ్ షో ప్రారంభం అయింది. తర్వాతి ఓవర్లోనే జేసన్ హోల్డర్‌ను (15: 44 బంతుల్లో, రెండు ఫోర్లు) సిరాజ్ అవుట్ చేశాడు.
నాలుగో రోజు సిరాజ్ బౌలింగ్ వేసిన ప్రతి ఓవర్లోనూ వికెట్ తీయడం విశేషం. చివర్లో కీమర్ రోచ్ (4: 13 బంతుల్లో), గాబ్రియెల్‌లను (0: 1 బంతి) ఒకే ఓవర్లో అవుట్ చేసి సిరాజ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ముకేష్ కుమార్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
టీ20 బ్యాటింగ్ చేసిన టీమిండియా...
వర్షం పడే అవకాశం ఉండటంతో టీమిండియా బ్యాటర్లు మొదటి బంతి నుంచే చెలరేగి బ్యాటింగ్ చేశారు. కీమర్ రోచ్ వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ (38: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) సిక్సర్, ఫోర్ కొట్టడంతో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఓపెనర్లు ఎక్కడా తగ్గలేదు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లోనే రోహిత్ శర్మ (57: 44 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయడం విశేషం.
మొదటి వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం గాబ్రియెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఈ దశలో వర్షం కురవడంతో ఎర్లీగా లంచ్ ప్రకటించారు. లంచ్ నుంచి తిరిగి రాగానే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యశస్వి జైస్వాల్‌ను వారికన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మళ్లీ వర్షం పడటంతో ఆట ఆగింది. అప్పటికి భారత్ 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.