ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఫైనల్లో పాకిస్తాన్ జట్టు ఏకంగా 128 పరుగులతో భారత జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ‘ఎ’ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత్ ‘ఎ’ జట్టు మాత్రం 40 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది.


పాకిస్తాన్ బ్యాటర్లలో తయ్యబ్ తాహిర్ (108: 71 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) భారీ సెంచరీ సాధించాడు. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (59: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సహిబ్జద  ఫర్హాన్  (65: 62 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీలు చేశారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (61: 51 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచారు.


ఆరంభం అదిరినా...
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ దాదాపు ఎనిమిది రన్‌రేట్‌తో పరుగులు చేశారు. మొదటి వికెట్‌కు 8.1 ఓవర్లలోనే 64 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న దశలో పాక్ బౌలర్ అర్షద్ ఇక్బాల్ భారత్‌ను దెబ్బ కొట్టాడు. వేగంగా ఆడుతున్న సాయి సుదర్శన్‌ను అవుట్ చేసి పాక్‌కు మొదటి వికెట్ అందించాడు.


వన్‌డౌన్ బ్యాటర్ నికిన్ జోస్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అయితే తర్వాత వచ్చిన యష్ ధుల్, సాయి సుదర్శన్ కాసేపు క్రీజులో నిలబడ్డారు. వీరు మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించారు. క్రీజులో ఉన్నంతసేపు చాలా వేగంగా ఆడిన అభిషేక్ శర్మ కూడా అవుట్ కావడంతో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది.


ఆ తర్వాత భారత బ్యాటింగ్ కుప్పకూలడానికి ఎక్కువ సేపు పట్టలేదు. ఎవరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో భారత్ 40 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో సుఫియాన్ ముకీమ్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ వసీం జూనియర్, మెహ్రాన్ ముంతాజ్, ముబాసిర్ ఖాన్, అర్షద్ ఇక్బాల్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. ముబాసిర్ ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.


సెంచరీ చేసిన తయ్యూబ్...
అంతకు ముందు టాస్ గెలిచిన భారత జట్టు సారథి యశ్ ధుల్.. పాకిస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. పాక్ ఓపెనర్లు  సయీమ్ అయూబ్ (59: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సహిబ్జద  ఫర్హాన్  (65: 62 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని  అందించారు. స్పిన్నర్ మానవ్ సుతర్ వేసిన 18వ ఓవర్లో సయీమ్  అయూబ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే  ఫర్హాన్ కూడా రనౌట్ అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన  ఒమైర్ యూసుఫ్  (35: 35 బంతుల్లో, నాలుగు ఫోర్లు)  ఫర్వాలేదనిపించాడు.  మరో బ్యాటర్ తయ్యూబ్ తాహిర్‌తో (108: 71 బంతుల్లో, 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) కలిసి  అతడు  పాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రియాన్ పరాగ్ వేసిన 28వ ఓవర్లో  ఒమైర్ రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే  కాసిమ్ అక్రమ్‌ను రియాన్ పరాగ్ డకౌట్‌గా వెనక్కిపంపాడు.


పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను తయ్యూబ్, ముబాసిర్ ఖాన్ (47 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)  పునర్నిర్మించారు. ముబాసిర్ అండతో తయ్యూబ్  పాకిస్తాన్ స్కోరుబోర్డును   పరుగులు పెట్టించాడు.  ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. హంగర్గేకర్ వేసిన  45వ ఓవర్లో ఐదో బంతికి  అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి తయ్యూబ్ పెవిలియన్ చేరాడు. లోయరార్డర్ బ్యాటర్లు కూడా బాగా బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో  ఎనిమిది వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో  పరాగ్, హంగర్గేకర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. హర్షిత్, సుతర్, సింధులకు తలా ఓ వికెట్ దక్కింది.