చిన్నపిల్లలు తల్లిదండ్రులను చూసే మాట్లాడడానికి నడవడం, తినడం అన్నీ నేర్చుకుంటారు. అలాగే పెద్దలు ఫాలో అయ్యే నియమాలనే... వీరు కూడా ఫాలో అవుతారు. పెద్దలు తినే ఆహారాలను, పానీయాలను తాము తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అలా తల్లిదండ్రులు ఎవరైతే మద్యానికి బానిసలు అవుతారో, అలాంటి వారి పిల్లలు కూడా మద్యం తాగే అవకాశాలు అధికంగా ఉన్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరికీ మద్యపాన వ్యసనం ఉన్నట్టు అయితే, అది వారి పిల్లలకు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే ఇలాంటి పిల్లలు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినేందుకు ఇష్టపడతారని. అలాంటి ఆహారాలకు బానిసలు అయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ అధ్యయనాన్ని 2000 మంది మద్యపానం అలవాటు ఉన్న తల్లిదండ్రులపై నిర్వహించారు. దాదాపు 10 ఏళ్లపాటు వారిని వారి పిల్లలను పరిశీలించారు.


ఆల్కహాల్‌కు బానిసలైన తల్లిదండ్రుల వద్ద ఉండే పిల్లలు కూడా ఆ వ్యసనానికి ప్రమాదకరస్థాయిలో బానిసలు అయ్యే అవకాశం అధికంగా ఉన్నట్టు ఈ పరిశోధనలో తేల్చారు. తల్లిదండ్రులు నిత్యం తాగుడులో మునిగి తేలుతూ ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా చెడుదారిలోనే వెళతారని, ఆ పానీయాలను తాగడానికి ఆసక్తి చూపిస్తారని, మంచి ఆహారాన్ని తీసుకునేందుకు వారు ఇష్టపడరని చెబుతున్నారు. కాబట్టి పిల్లల జీవితం ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. పిల్లల ముందు మనం తినే ఆహారాలు, తాగే పానీయాలు చేసే పనులే వారి భవిష్యత్తును ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.


ఐస్ క్రీములు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాలు వంటివి ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు. ఎక్కువ స్థాయిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను, కొవ్వులను ఇవి కలిగి ఉంటాయి. మద్యపానం చేసే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో ఇలాంటి ఆహారాలు తినాలన్న కోరిక అధికంగా ఉంటుంది. ఇవి వారి ఆరోగ్యాన్ని త్వరగా నాశనం చేస్తుంది. చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు వచ్చే అవకాశాలను పెంచుతుంది. మీ పిల్లల ఆరోగ్యం, జీవితం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి వారు బాగుండాలంటే మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. తల్లిదండ్రులు ఎలాంటి జీవనశైలిని అనుసరిస్తారో, పిల్లలు కూడా అలాంటి జీవనశైలిని అనుసరిస్తారు. కాబట్టి ఇంట్లో సంతోషకరమైన, ప్రశాంతకరమైన వాతావరణం ఉండేలా చూసుకోండి. ఆల్కహాల్ వంటివి పిల్లల ముందు తాగకండి. పిల్లల ముందు గొడవ పడడం, బూతులు తిట్టుకోవడం లాంటివి చేయకండి. లేకుంటే వారు అలాంటి పద్ధతులని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ.


Also read: తరచూ కాలు జారినట్టు అనిపిస్తోందా? ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి



Also read: ఆ పరీక్షతో గుండెపోటు వచ్చే అవకాశాన్ని ముందే తెలుసుకోవచ్చా?














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.