Mrunal Thakur: టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా నటించి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఈ మూవీలో మృణాల్ అందం, అభినయానికి యూత్ అంతా ఫిదా అయిపోయారు. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. నేడు(ఆగస్టు 1) ఆ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీరియల్స్ లో నటించే స్థాయి నుంచి టాప్ హీరోయిన్ స్థాయికి మృణాల్ ప్రస్థానం ఎలా సాగిందో సంక్షిప్తంగా చూద్దాం.


సీరియల్స్ తో ప్రారంభించి..


మృణాల్ ఠాకూర్ మహారాష్ట్ర ధూలేలో ఆగస్టు 1, 1992 న జన్మించింది. ఆమె విద్యాభ్యాసం అంతా ముంబై పరిసర ప్రాంతంలోనే సాగింది. మృణాల్ కాలేజ్ డేస్ లోనే నటనపై ఆసక్తితో సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. 2012 -13 ప్రాంతంలో ‘ముజ్సే కుచ్ కెహ్తీ..ఖామోషియాన్’ నటించి అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత పలు సీరియల్స్ లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. ఆమె ఎక్కువ కాలం నటించిన సీరియల్ ‘కుంకుమ్ భాగ్య’ ఇప్పటికీ టీవీల్లో వస్తూనే ఉంటుంది. ఈ సీరియల్ తోనే మృణాల్ కు మంచి గుర్తింపు వచ్చింది. పలు సీరియల్స్, రియాలిటీ షోలలో చేసిన తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. 


టీవి నుంచి సిల్వర్ స్కీన్ వైపు..


మృణాల్ ఓ వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించేది. ఆమె మొదటి సినిమా ‘విట్టు దండు’. ఈ మరాఠీ సినిమా 2014 లో వచ్చింది. ఈ మూవీతో మృణాల్ సినీ ప్రస్థానం మొదలైంది. అదే ఏడాది మరాఠీలో ‘సురాజ్య’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తర్వాత 2015 లో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఆ ఏడాది హిందీలో ‘లవ్ సోనియా’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ మూవీలో ఆమె నటనకు మంచి మార్కులే దక్కినప్పటికీ కమర్షియల్ గా మూవీ హిట్ అందుకోలేదు. ఆ సమయంలో మృణాల్ పై చాలా విమర్శలు వచ్చాయి. టీవీ సీరియల్ నటి హీరోయిన్ కావడం ఏంటి అనే చర్చ కూడా నడిచింది. వాస్తవానికి అలా కొంత మంది సీరియల్ నటులు సిల్వర్ స్క్రీన్ పై ఫెయిల్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే మృణాల్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ‘లవ్ సోనియా’ తర్వాత కూడా మృణాల్ కూ బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఆమె పూర్తి స్థాయి బాలీవుడ్ నటిగా మారింది. 


నువ్వు హీరోయిన్ ఏంటి అని ఎగతాళి చేసేవారు: మృణాల్ ఠాకూర్


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చింది. ఆడిషన్స్ లో తిరస్కరించడం దగ్గర నుంచీ ఆడిషన్ లేకుండానే సినిమాకు తీసుకోవడం వరకూ ఎలా వచ్చిందో చెప్పింది. తన కెరీర్ మొదట్లో టెలివిజన్ నటి హీరోయిన్ ఏంటీ అని విమర్శించేవారని, తనను డిమోటివేట్ చేసేవారని పేర్కొంది. ఆ సమయంలో మంచి సినిమా రావడానికి తనకు 7 నుంచి 8 నెలలు పట్టేదని చెప్పింది. ఆడిషన్స్ కోసం దర్శకులను నిర్మాతలను అభ్యర్థించాల్సి వచ్చేదని అయినా ఎవరూ కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొంది. అయితే ఒకటి రెండు సినిమాల తర్వాత తనపై మేకర్స్ కు నమ్మకం కుదిరిందని తర్వాత ఆడిషన్స్ లేకుండానే సినిమాల్లోకి తీసుకునేవారని తెలిపింది. 


‘సీతారామం’ తో దేశవ్యాప్త గుర్తింపు..


ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా. 2022 లో వచ్చిన ఈ మూవీ ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో మృణాల్ కు నేషనల్ లెవల్ లో క్రేజ్ వచ్చేసింది. అప్పటి నుంచి మృణాల్ కు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 






Also Read: ఆఫర్ల కోసం స్టార్ హీరోలతో డేట్ చేయమని అడిగారు: నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial