ఈమధ్యకాలంలో సినిమాలోని ఒక్క పాట బాగుంటే చాలు.. ఆ పాట ద్వారా సినిమాకు కావాల్సిన హైప్‌ను పెంచాలని అనుకుంటున్నారు మేకర్స్. సినిమా ప్రమోషన్స్‌లో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ కానుంది. ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేసే రామ్‌కు శ్రీలీల తోడయితే.. ఆ పాట, స్టెప్పులు, ఊపు.. ఏ రేంజ్‌లో ఉంటాయో తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.


శ్రీలీల డ్యాన్స్ కోసం ఎదురుచూపులు..
ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరో, హీరోయిన్లు కలిసి డ్యాన్స్ చేసేవారు. కానీ కొన్నేళ్ల తర్వాత అలాంటి డ్యాన్స్‌లకు, పాటలకు క్రేజ్ తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ట్రెండ్ తెరపైకి వచ్చింది. హీరోయిన్లు మాస్ డ్యాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్.. డ్యాన్స్‌కే కొత్త అర్థాన్ని, అందాన్ని తీసుకొచ్చింది. ఇక చేసింది తక్కువ సినిమాలే అయినా.. సాయి పల్లవి లాగా డ్యాన్స్ చేయగలుగుతుంది అని పేరు సాధించిన ముద్దుగుమ్మ శ్రీలీల. ఈ భామ నటించిన మొదటి సినిమా ‘పెళ్లిసందడి’ అంతగా హిట్ అవ్వకపోయినా కూడా మేకర్స్ అందరూ తన అందానికి ఫిదా అయిపోయి ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చేస్తున్నారు. అలాగే రామ్ సరసన కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.


రామ్ చివరి చిత్రం ‘వారియర్’ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో యాక్షన్ మూవీని ప్లాన్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండే మాస్ ప్రేక్షకులకు ఫీస్ట్‌గా మారనుందని అర్థమయ్యేటట్టుగా మేకర్స్ ప్లాన్ చేశారు. ‘స్కంద’కు మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీలను రంగంలోకి దించారు. శ్రీలీల, రామ్ జతకడుతున్నారని తెలిసినప్పటి నుండి వీరిద్దరూ కలిసి ఒక మాస్ సాంగ్‌కు స్టెప్పులేస్తే చూడాలని ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అన్ని భాషల్లో ఒకేసారి..
శ్రీలీల ఎప్పటికప్పుడు స్కంద అప్డేట్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉంది. అలాగే ఒక సాంగ్ షూటింగ్ కోసం వీరు ఔట్‌డోర్ వెళుతున్నారు అన్నప్పటి నుండి ఫ్యాన్స్ అంతా సాంగ్ అప్డేట్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది. ఎనర్జిటిక్ వైబ్‌కు రిథమ్ రెడీ అంటూ మేకర్స్.. ఈ సాంగ్ అప్డేట్‌ను బయటపెట్టారు. స్కంద ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టూ చుట్టూ’ ప్రోమో ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10.26కు విడుదలకు సిద్ధమయ్యింది. ఇక పూర్తి పాట కోసం ఆగస్ట్ 3 ఉదయం 9.36 వరకు ఎదురుచూడాల్సిందే అని మేకర్స్ బయటపెట్టారు. తెలుగులో మాత్రమే కాదు.. ‘మే పీచే పీచే’ పేరుతో హిందీలో, ‘ఒన్న సుతి సుతి’ పేరుతో తమిళంలో, ‘నిన్ సుత సుత’ పేరుతో కన్నడలో, ‘నీ తొట్టు తొట్టా’ పేరుతో మలయాళంలో ఒకేసారి స్కంద ఫస్ట్ సింగిల్ ప్రోమో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఎనర్జిటిక్ పాటకు, సినిమాకు తమన్ సంగీతం అందించాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌పై శ్రీనివాస చిట్టూరి.. స్కందను నిర్మించారు.


Also Read: మరో భారీ సీక్వెన్స్‌కు ‘దేవర’ రెడీ - క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు!