ఒకప్పుడు ఏ భాష సినిమాను ఎవరు రీమేక్ చేస్తున్నారు అనే వివరాలు చాలా గోప్యంగా ఉండేవి. ఒకవేళ ఏ సినిమా రీమేక్ అవుతుందని తెలిసినా.. అది వేరే భాషా చిత్రం కదా, తెలుగులో విడుదలయిన తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉండేవారు ప్రేక్షకులు. కానీ రోజులు చాలా మారిపోయాయి. ముఖ్యంగా ఓటీటీలు అనేవి వచ్చిన తర్వాత భాష రాకపోయినా.. సబ్ టైటిల్స్ ఉన్నాయిగా అనే ఆలోచనతో ఇతర భాష చిత్రాలకు కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా మలయాళ సినీ పరిశ్రమ.. ఇతర భాషా పరిశ్రమలను డామినేట్ చేసేస్తోంది. అందుకే ఒరిజినల్‌గా మలయాళంలోనే చిత్రాలను చూడడానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అయినా కొందరు మేకర్స్.. సినిమాలను రీమేక్ చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మలయాళ సినిమా ‘నాయట్టు’ తెలుగులో రీమేక్‌ అవుతోంది.


‘కోట బొమ్మాళి పీఎస్’గా ‘నాయట్టు’..
మలయాళంలో ‘నాయట్టు’ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీఏ2 పిక్చర్స్ నాయట్టును తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యింది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్‌కుమార్.. ఈ రీమేక్‌లో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. నాయట్టు తెలుగు రీమేక్‌కు ‘కోట బొమ్మాళి పీఎస్’ అనే టైటిల్ ఖరారయ్యింది.


నాయట్టు చిత్రం ముగ్గురు పోలీసుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి ప్రమేయం లేకుండా ఒక గ్యాంగ్ గొడవలో చిక్కుకున్న పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తడమే సినిమా కథ. ఈ చిత్రంలో పొలిటికల్, పబ్లిక్ ఒత్తిడి వల్ల పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని వల్ల పోలీసులు పడే ఇబ్బందులు ఏంటి లాంటి కాంట్రవర్షియల్ అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఓట్లే పడ్డాయి. నాయట్టు కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నామని మేకర్స్ చెప్తున్నారు. 


ఆసక్తికరమైన మోషన్ పోస్టర్..
ఇప్పటికే ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా టైటిల్, క్యాస్టింగ్ మాత్రమే కాదు.. మోషన్ పోస్టర్ కూడా విడుదలయ్యింది. ఈ మోషన్ పోస్టర్ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు అప్పుడే పాజిటివ్ రివ్యూ ఇచ్చేస్తున్నారు. పరారీలో ఉన్న కోట బొమ్మాళి పోలీసులు అంటూ మోషన్ పోస్టర్ మొదలవుతుంది. ఇందులో గన్స్, బాలెట్ పేపర్లు, లాంటి పలు వస్తువులు కూడా చూపించారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమాను బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన తేజ మర్ని చేతికి ఈ రీమేక్ బాధ్యతలు అందజేశారు. ఇదివరకు నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన ‘కస్టడీ’ చిత్రం కూడా నాయట్టులాగా ఉందంటూ కామెంట్స్ వచ్చినా.. కస్టడీ మేకర్స్ మాత్రం ఈ కామెంట్స్‌ను కొట్టిపారేశారు. 






Also Read: వీకెండ్‌లో ‘బ్రో’ సత్తా - ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ!