మల్టీ స్టారర్ సినిమాలకు తెలుగులో ఉండే క్రేజే వేరు. ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటించినా, ఇద్దరు సీనియర్ హీరోలు కలిసి నటించినా.. ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. కానీ గత కొన్నేళ్లలో ఒక సీనియర్ హీరో, ఒక యంగ్ హీరో కలిసి నటించడం సినీ పరిశ్రమలో ట్రెండ్‌గా మారింది. అలాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ, సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి కూడా. అలాంటి తోవకు చెందిన మల్టీస్టారరే ‘బ్రో’. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు.. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్.. ఈ సినిమాలో కలిసి నటించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దానికి తగినట్టుగానే ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.


సముద్రఖని... తమిళంతో పాటు తెలుగులో కూడా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన స్వతహాగా మంచి దర్శకుడు కూడా. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన సందేశాత్మక చిత్రం ‘వినోదాయ సితం’. అక్కడ కీలక పాత్రల్లో సముద్ర ఖని, తంబి రామయ్య నటించారు. తెలుగు సముద్ర ఖని పాత్రను పవన్ కళ్యాణ్, తంబి రామయ్య పాత్రను సాయి ధరమ్ తేజ్ పోషించారు.


వీకెండ్‌లో కలెక్షన్ల వర్షం


బ్రోకు వీకెండ్ బాగా కలిసొచ్చిందని కలెక్షన్స్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రో వీకెండ్ కలెక్షన్స్ రూ.57 కోట్లని లెక్కలు చెప్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఏకంగా రూ.64 కోట్లు కలెక్ట్ చేసిందట ఈ సినిమా. ఓవర్సీస్‌లో కూడా 1.70 మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రో మొదటి వీకెండ్ కలెక్షన్స్ రూ.78 కోట్లని తెలుస్తోంది. ఇంతకు ముందు విడుదలయిన ఆదిపురుష్ లాంటి పెద్ద సినిమాలతో పోలిస్తే.. బ్రో వీకెండ్‌కు 80 శాతం ఎక్కువ కలెక్షన్స్‌నే అందుకుంది. ఆదిపురుష్‌కు టికెట్ ధరలు పెరిగినా సాధించలేని కలెక్షన్స్‌ను బ్రో.. ఏ టికెట్ ధర పెంపు లేకుండానే సాధించిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ నైజాంలో మాత్రం బ్రోకు అనుకున్నంత ఆదరణ దక్కలేదు.


బ్రో ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్
శుక్రవారం: రూ.28.50 కోట్లు
శనివారం: రూ.18.25 కోట్లు
ఆదివారం: రూ.17.50 కోట్లు
మొత్తంగా: రూ.64.25 కోట్లు


ప్రాంతాలవారీగా బాక్సాఫీస్ కలెక్షన్స్
నైజాం: రూ.23.20 కోట్లు (రూ.14.10 కోట్లు షేర్)
సీడెడ్: రూ.7.40 కోట్లు (రూ.5.30 కోట్లు షేర్)
ఆంధ్ర: రూ.26.40 కోట్లు (రూ.18.90 కోట్లు షేర్)
ఆంధ్ర, తెలంగాణ: రూ.57 కోట్లు (రూ.38.30 కోట్లు షేర్)
కర్ణాటక: రూ.5.50 కోట్లు (రూ.2.70 కోట్లు షేర్)
భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో: రూ.1.75 కోట్లు (రూ.0.70 కోట్లు షేర్)
మొత్తంగా భారతదేశంలో: రూ.64.25 కోట్లు (రూ.41.70 కోట్లు షేర్)


ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజుల్లో రూ. 50.6 కోట్ల షేర్, రూ. 82.3 కోట్ల గ్రాస్ వసూళ్లను ‘బ్రో’ సాధించింది.


‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్, ఆలీ రెజా, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు సముద్రఖని ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం అందించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.


Also Read: పెళ్లి మాత్రమే కాదు, బిడ్డ కూడా ప్రమోషన్‌లో భాగమే - రణబీర్, ఆలియాపై కంగనా షాకింగ్ కామెంట్స్