మనుషులకి జంతువుల మీద పిచ్చి ప్రేమ ఉండటం సహజం. కొందరికి కుక్కలంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. జపాన్‌ కు చెందిన టోకో అనే వ్యక్తికి ఎందుకు అనిపించిందో ఏమో..కానీ  స్వయంగా ఆయనే కుక్కలాగా మారిపోయాడు. దానికోసం ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. సుమారు 40 రోజులు శ్రమించి నిపుణులు కుక్కలాంటి డ్రెస్‌ ని తయారు చేసి పెట్టారు. 


అంత ఖర్చు పెట్టి కుక్క కాస్ట్యూమ్‌ ని తయారు చేసుకున్న వ్యక్తి ఊరికే ఉంటాడా?. కుక్కలా మారిన తరువాత మరి బయట ప్రపంచాన్ని చూడాలని అనుకుంటాడు కదా! అందుకే కుక్కలా మారిన తరువాత మొట్టమొదటిసారి బయటకు వాకింగ్‌ కు వచ్చాడు. రావడంతోనే నిజమైన కుక్కలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. నేల మీద దొర్లాడు. తోక ఊపాడు. ఇతర కుక్కలతో కలిసి ముద్దులాడాడు. కుక్కలా షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి పనులన్నీ కూడా చేశాడు. 


ఇప్పుడు ఈ శునక మానవుడి వీడియోలు నెట్టింట వైరల్‌ గా మారాయి. నిజానికి టోకో కుక్కలా మారి చాలా కాలమే అవుతున్నప్పటికీ అతనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడానికి ఇప్పటి వరకు ఎటువంటి పర్మిషన్ లేదు. తాజాగా అతనికి వీడియోలు పోస్ట్‌ చేసుకోవడానికి అనుమతి లభించింది. దాంతో ఈ శునక మానవుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 



తన వ్యక్తిగత యూట్యూబ్‌ ఛానెల్‌ లో అనేక వీడియోలను పంచుకున్నాడు ఇప్పటికే టోకో సుమారు 33,000 మంది సబ్‌ స్కైబ్రర్స్ ను కలిగి ఉన్నాడు. మొట్టమొదటిసారి బయట వాకింగ్‌ కు వచ్చిన వీడియోను పంచుకున్న వెంటనే అనేక మంది దానిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. యూట్యూబ్‌ లో టోకో తన కల గురించి, ఈ శునక ప్రయాణం గురించి చాలా చక్కగా వివరించాడు.


మొదటి సారి వాకింగ్‌ కు బయటకు వెళ్లినప్పుడు అయితే కొన్ని కుక్కలు తన వద్దకు వచ్చి భయంతో మళ్లీ తిరిగి వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ఇలా శునకంగా మారాలి అనేది తన చిన్ననాటి నుంచి కంటున్న కల అంటూ టోకో చెప్పుకొచ్చాడు. వీటిని అన్నిటిని చూసిన కొందరు నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు.


ఈ శునకానందం ఇక్కడితో ఆగుతుందా ? లేక పెళ్లి కూడా చేసుకునే దాకా వెళ్తుందా? అని కామెంట్లు పెట్టారు. దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టి మరీ కుక్కలా మారాడు అంటూ మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. 


మరికొందరైతే ఇలా మనిషి లా మారి అతని జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రభుత్వమే అతనికి అనుమతినిచ్చిందంటూ రాసుకొచ్చారు.