హీరో విక్రమ్ హఠాత్తుగా ఆసుపత్రిలో చేరారు. ఛాతీ భాగంలో ఇబ్బందిగా అనిపించడంతో ఆయన హుటాహుటిన వైద్యులను సంప్రదించారు. అయితే అతని కొడుకు ధ్రువ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం అతనిది ఛాతీ నొప్పి, గుండె నొప్పి కాదు. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఛాతీ, గుండె ఉండేదే పక్కపక్కనే. మరి ఆ రెండు నొప్పుల్లో ఏదేంటో తెలుసుకోవడం ఎలా? ఛాతీ నొప్పి, గుండె నొప్పి వేరు వేరా? ఈ సందేహాలు చాలా మందికి వస్తాయి. 


గుండెతో సంబంధం...
అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం అంజినా అనేది ఛాతీ నొప్పి కిందకి వస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే ఒక అసౌకర్యం. దీనితో బాధపడుతున్న వ్యక్తులు ఛాతీపై బరువును ఉంచినట్టు, పిండేసినట్టు ఫీలవుతారు. ఈ అసౌకర్యం భుజాలు, చేతులు, మెడ, దవడ, పొట్ట లేదా వీపు భాగంలో కూడా కలగవచ్చు. చాలా సార్లు దీన్ని అజర్తి వల్ల కలిగినదిగా అనుకుంటారు ప్రజలు. కానీ అది తప్పు. కొంతమందికి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లక్షణాలన్నీ గుండె కండరాలకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగేవి. దీన్ని ‘యాంజినల్ ఈక్విలెంట్’ అంటారు. 


ఇవి కూడా కారణాలే...
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ చెప్పిన ప్రకారం ఛాతీ నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో గుండె సమస్యలు కూడా ఒకటి. ఛాతీ నొప్పిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. తీవ్రంగానే పరిగణించాలి. ఛాతీ నొప్పికి కారణం గుండెల్లో మంట, నిమోనియా, గుండె పోటు కూడా కావచ్చు. ఛాతీ నొప్పి వచ్చిందంటే నిమిషం నుంచి కొన్ని గంటల పాటూ ఉంటుంది. కొన్ని సార్లు ఆరు నెలల పాటూ సాగిన సందర్భాలు ఉంటాయి. 


ఈ లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యే...
అలాగని ఛాతీ నొప్పి కచ్చితంగా గుండె సమస్య వల్లే అని చెప్పలేం. అయితే ఛాతీ నొప్పితో పాటూ కింద చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తే అది గుండెసమస్యేమో అనుమానించాలి. 


1. ఛాతీనొప్పి వచ్చినప్పుడు తీవ్రంగా చెమటలు పడుతున్నా...
2. వికారంగా, వాంతులు వస్తున్నట్టు అనిపిస్తున్నా
3. శ్వాస అందకపోయినా
4. తేలికపాటి తలనొప్పి వచ్చినా
5. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా క్రమరహితంగా అనిపించినా
6. వీపు వైపు, దవడ, మెడ, పొత్తి కడుపు పైభాగంలో నొప్పి, చేయి, భుజం లాగుతున్నట్టు అనిపించడం, లేదా కదిపినప్పుడు నొప్పి రావడం


ఇవన్నీ కూడా గుండె సమస్యకు సంకేతాలు. ఛాతీ నొప్పి అకస్మాత్తుగా వచ్చినా, లేదా మందులు వేసుకున్న తరువాత వచ్చినా, అయిదు నిమిషాల కన్నా ఎక్కువ సేపు ఉన్నా వెంటనే ఆసుపత్రిలో చెకప్ చేయించుకోవాలి. 


Also read: మగవారు జాగ్రత్త పడాల్సిందే, పెరిగిపోతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు


Also read: నెగిటివ్ వార్తలు అధికంగా చదువుతున్నారా? మానసికంగా దెబ్బతినడం ఖాయం