Hyderabad Rains : హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జంటనగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. సికింద్రాబాద్‌, ఉప్పల్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట్‌, బేగంపేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, నాంపల్లి, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌తో పలుచోట్ల  కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసరసాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 అధికారులు ఏర్పాటుచేశారు.  






వచ్చే రెండు రోజులు రెడ్ అలర్ట్ 


ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొంది. రాగల రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌, ఆ తరువాత రెండు రోజులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణం కన్నా 45 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.