Reduce Heart Attack Risk : ఈ మధ్యకాలంలో గుండె సమస్యలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సరైన లైఫ్​స్టైల్​ని మెయింటైన్ చేయలేకపోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం, ఒత్తిడి, అనారోగ్యం ఇలా ఎన్నో కారణాలు గుండె సమస్యలను పెంచుతున్నాయి. అయితే గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజూ 7 పనులు చేయాలంటున్నారు నిపుణులు. దీనివల్ల హార్ట్ అటాక్ సమస్యలను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మరణానికి ప్రధాన కారణం హృదయ సమస్యలే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రతి సంవత్సరం సుమారు 1.8 కోట్లమంది గుండె సమస్యలతో చనిపోతున్నారని తెలిపింది. అందుకే లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేస్తే ఈ గుండె సమస్యల్ని దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు. గుండెపోటు ప్రమదాన్ని తగ్గించగలిగే హెల్తీ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

హైడ్రేషన్.. 

శరీరానికి పుష్కలంగా నీటిని అందించడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మీ ఉదయాన్ని ఓ గ్లాస్​ నీటితో ప్రారంభించండి. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. సమ్మర్ కదా అని ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు సోడాలు, ఎనర్జీ డ్రింక్​ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. షుగర్ డ్రింక్స్ కాకుండా.. నీళ్లు, కొబ్బరి నీళ్లు, ఇంట్లో తయారు చేసిన జ్యూస్​లు తీసుకుంటే మంచిది. గ్రీన్ టీ, ఇంఫ్యూజ్ వాటర్ కూడా మంచివే. ఇవి రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేస్తాయి. 

వ్యాయామం 

శారీరక శ్రమ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్దలు కనీసం వారానికి 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నడక, సైక్లింగ్, డ్యాన్స్ వంటి కార్యకలాపాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్​గా బాడీ యాక్టివ్​గా, పనిచేసేలా చూసుకోండి. 

అల్పాహారం (బ్రేక్​ఫాస్ట్)

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ బ్రేక్​ఫాస్ట్​తో రోజును ప్రారంభించాలి. అల్పాహారం తినకుండా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి కచ్చితంగా బ్రేక్​ఫాస్ట్ తీసుకోవాలంటున్నారు. వాటిలో తృణధాన్యాలు, పండ్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. ఓట్​మీల్, కూరగాయలు, నట్స్, బెర్రీలు వంటివి మంచి ఆప్షన్. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందించి కొలెస్ట్రాల్​ను అదుపులో ఉంచుతాయి. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. 

వాటికి నో.. 

అధిక ఉప్పు రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకం. అలాగే షుగర్స్ కూడా బరువు పెరిగేలా చేస్తాయి. డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే గుండెపై కూడా నెగిటివ్​గా ఒత్తిడి చేస్తాయి. కాబట్టి చక్కెరకు, ఉప్పునకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. క్రేవింగ్స్​ కంట్రోల్ కాకుండా.. తీసుకోగలిగే షుగర్స్ తీసుకోవచ్చు. 

చిన్న బ్రేక్.. 

మీరు చేసేది డెస్క్ జాబ్ అయితే మీరు ఎక్కువసేపు కూర్చోనే ఉంటారు. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గంటకు ఓ బ్రేక్ తీసుకుని శరీరాన్ని స్ట్రెచ్ చేయండి. లేదా వేగంగా నడవండి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోజంతా మీరు యాక్టివ్​గా ఉండేలా చూస్తుంది. 

ఒత్తిడి 

ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అది కూడా సైలెంట్​గా. ఈ సైలెంట్ కిల్లర్ రక్తపోటును, ఇన్​ఫ్లమేషన్​ను పెంచి గుండెపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తుంది. డీప్ బ్రీత్, ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోజులో మీకు నచ్చినపని ఏమి చేసినా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరిచి గుండె సమస్యలను దూరం చేస్తుంది.

వారితో మాట్లాడండి.. 

నచ్చినవారితో మాట్లాడినప్పుడు హాయిగా నవ్వుకుంటాము. అలా నవ్వినప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. రక్తప్రవాహం మెరుగువుతుంది. మానసిక స్తితి మెరుగవుతుంది. కాబట్టి నచ్చినవారికి కాల్ చేసి లేదా డైరక్ట్​గా వెళ్లి మాట్లాడండి. లేదా నచ్చిన ప్రోగ్రామ్ చూడండి. మానసిక శ్రేయస్సు గుండె సమస్యలను దూరం చేస్తుందని గుర్తించుకోవాలి. 

అలాగే డీప్​ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండడం. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం మంచిది. స్మోకింగ్, ధూమపానం మానేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి అవగాహన మీకు కేవలం కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని వాటిని ఫాలో అయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. 

Also Read : నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే మీరు చాలా కోల్పోతున్నారు తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.