అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కూరలో కాస్త ఉప్పు, కారం తగ్గితే చప్పగా ఉంది అంటూ తినడానికి ఇష్టపడం. అలాంటిది రుచీ, వాసన రెండూ కోల్పోతే అది కూడా నెలల తరబడి, ఆ జీవితం ఎంత నిర్జీవంగా అనిపిస్తుందో ఆ పరిస్థితిని అనుభవించినవారికే తెలుస్తుంది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో చాలా మందికి రుచి, వాసన తెలియదు. కొందరిలో రుచి తెలిసినా వాసన శక్తి మాత్రం పోతుంది. కొందరిలో పదిరోజులకే ఆ శక్తి వెనక్కి వస్తుంది. మరికొందరికి నెలరోజులు పడుతుంది. దాదాపు తొంభైశాతం మందికి నెల రోజుల్లోనే రుచి, వాసన శక్తులు వెనక్కి వచ్చేస్తాయి. కానీ కొందరిలో మాత్రం ఎంతకీ రావు. నిజానికి వాటికి చికిత్స కూడా లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే త్వరగా వాసన, రుచి గ్రాహ్య శక్తి సాధారణ స్థితికి వస్తుంది.
ఆముదం
ఆయుర్వేద వైద్యులు అంకితా గుప్తా చెప్పినదాని ప్రకారం ఆముదాన్ని గోరువెచ్చగా చేసి ముక్కు రంధ్రాల్లో ఒక్కో చుక్క వేయాలి. ఇది ప్రతి రోజూ కొన్ని రోజులపాటూ చేయాలి.
వెల్లుల్లి రెబ్బలు
ఒక కప్పు నీటిలో రెండు లేదా మూడు తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేయాలి. ఒక గిన్నెలో వాటిని వేసి, చాలా చిన్న మంట మీద ఉడికించాలి. అయిదు నిమిషాలు ఉడికించాక చల్లారబెట్టాలి. వడకట్టి ఆ నీటిని తాగేయాలి. వెల్లుల్లిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ముక్కుకు చికిత్స చేసి, వాసనను గ్రహించేలా చేస్తాయి.
నిమ్మరసం
ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. నిమ్మ సిట్రస్ పండు కాబట్టి మంచి వాసనను కలిగి ఉంటుంది. ఈ రెండు ఆహారాలలోని లక్షణాలు రుచి, వాసన తిరిగి రావడానికి సహాయపడతాయి.
అల్లం
అల్లం ముక్కను తీసుకుని పైన పొట్టు తీసేయాలి. ఆ ముక్కను నెమ్మదిగా నములుతూ ఉండాలి. అల్లం ముక్క నమలలేం అనుకుంటే అల్లంటీ చేసుకుని తాగండి. అల్లం వాసన చాలా బలంగా ఉంటుంది. అవి రుచి గ్రంథులను ప్రేరేపించే అవకాశం ఉంది.
పుదీనా
పుదీనా ఆకులను నీటిలో వేసి ఉడికించాలి. చల్లారాక వడకట్టి అందులో కాస్త తేనె కలుపుకుని తాగేయాలి. పుదీనా ఆకులలో ముఖ్యంగా మెంథాల్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వాసన, రుచి గ్రంథులను ప్రేరేపిస్తుంది. ఇలా తరచూ తాగడం వల్ల త్వరగా రుచి, వాసన శక్తి తిరిగి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.
పైన చెప్పినవే కాదు ఘాటైన వాసన వేసే పచ్చ కర్పూరం, ఎండు చేపలు వంటివి కూడా రోజులో ఏడెనిమిదిసార్లు వాసన చూస్తుండాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.
Also read: ఉప్పు వేసిన ఆహారం అధికంగా తిన్నారా... అయితే వెంటనే వీటిని తినండి, రిస్క్ తగ్గుతుంది
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు
Also read: మానసిక హింసకు గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ వచ్చే అవకాశం... ఏంటీ బ్రోకెన్ హార్ట్?
Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు