పొట్ట ఉబ్బరం, కడుపులో నొప్పి, పుల్లటి తేపులు వస్తుంటే గ్యాస్ ఫామ్ అయ్యిందని అనుకుంటారు. కానీ ఇటువంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే అది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) గా మారవచ్చు. దిన్నె యాసిడ్ రిఫ్లక్స్ అని కూడా పిలుస్తారు. అన్నవాహిక గుండా మండుతున్న భావన కలిగిస్తుంది. వారానికి రెండు సార్లు కంటే ఎక్కువగా మంట వచ్చిన అనుభూతి కలిగిందంటే వాళ్ళు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అనేందుకు సూచిక. ఇది సాధారణ సమస్య అని తేలికగా తీసుకుంటే తర్వాత జీర్ణ సంబంధిత సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. 


అసలేంటి ఈ GERD, దీని లక్షణాలు ఎలా ఉంటాయి?


యాసిడ్ రిఫ్లక్స్ ఆరోగ్య పరిస్థితి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఛాతిలో మంట, పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ గా ఉంటూ అది గొంతు వరకు వస్తుంది. దీన్నే గుండెల్లో మంట అని కూడా పిలుస్తారు. నోటి నుంచి పుల్లటి లేదా చెడు తేపులు వస్తాయి. ఇవి ఇతర జీర్ణాశయాంతర సమస్యల లక్షణాలను పోలి ఉంటుంది.


☀ వికారం


☀ దీర్ఘకాలిక దగ్గు


☀ ఆహారం మింగేటప్పుడు నొప్పి


☀నోటి దుర్వాసన


☀ ఛాతీ నొప్పి  


☀ గద్గద స్వరం


GERD నిర్ధారణ ఎలా?


GERD వ్యాధితో బాధపడుతున్నారో లేదో తెలుసుకునేందుకు వైద్యులు బాధిత వ్యక్తి లక్షణాలను పరిశీలిస్తారు. రోగనిర్ధారణ ఆధారంగా చికిత్స ప్రక్రియ జరుగుతుంది. రోగ నిర్ధారణ కోసం ఉపయోగించే కొన్ని పద్ధతులు..


ఎసోఫోగ్రామ్: ఈ ప్రక్రియలో భాగంగా బెరియం ద్రావణాన్ని తాగాల్సి ఉంటుంది. తర్వాత జీర్ణవ్యవస్థని పరిశీలించడానికి ఎక్స్ రే చేస్తారు.


అప్పర్ ఎండోస్కొపీ: ఒక ట్యూబ్ కి చిన్న కెమెరా పెట్టి అన్నవాహికలోకి పంపిస్తారు. ఇది అన్నవాహికని పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. అవసరం అనిపిస్తే బయాప్సీ కోసం ఆ ప్రాంతం నుంచి చిన్న కణజాలం సేకరిస్తారు.


అంబులెటరీ 24 గంటల pH ప్రోబ్: ఈ ప్రక్రియలో భాగంగా ఒక చిన్న ట్యూబ్ ని ముక్కు ద్వారా అన్నవాహికలోకి పంపిస్తారు. దాని కొన చివర pH సెన్సార్ ఏర్పాటు చేస్తారు. ఇది అన్నవాహికలో ఉన్న యాసిడ్ మొత్తాన్ని కొలిచేందుకు సహాయపడుతుంది. ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్నారా లేదా అనేది నిర్ధారించడానికి ఇది ఉత్తమమైన మార్గం. అయితే ఈ ట్యూబ్ 24 గంటల పాటు ధరించి ఉండాలి.


అన్నవాహిక pH పరీక్ష: ఈ పద్ధతిలో ఒక చిన్న పరికరాన్ని అన్నవాహికలోకి ప్రవేశపెడతారు. ఇది శరీరంలోని ఆమ్లాలు ఎలా నీయాంత్రిస్తుందో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ కొన్ని రోజులు పడుతుంది.


వ్యాధికి చికిత్స ఏంటి?


ఎటువంటి వ్యాధి నుంచి అయిన బయట పడేందుకు ముందుగా చేయాల్సింది జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే. వీటితో పాటు వైద్యుని సూచన మేరకు మరికొన్ని మార్పులు చేసుకోవచ్చు. 


☀ ధూమపానం మానెయ్యాలి


☀ శరీర బరువు అదుపులో ఉంచుకోవడం


☀ భోజనం తిన్న తర్వాత పడుకునే ముందు కొన్ని గంటలు గ్యాప్ ఇవ్వడం


☀ సాయంత్రం వేళ భోజనం మితంగా తీసుకోవడం


☀ తలని ఎత్తైన స్థితిలో ఉంచేందుకు ప్రయత్నించడం


జీవనశైలిలో మార్పులు చేసుకున్నప్పటికి పరిస్థితిలో మార్పు లేకపోతే వైద్యులు సూచించే మందులు వినియోగించాలి. యాంటాసిడ్లు, H2 రిసెప్టర్ బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPI) వంటి మందులని వైద్యులు సూచిస్తారు. ఇవి కడుపులో ఏర్పడే యాసిడ్స్ ని తగ్గించేందుకు సహకరిస్తాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: క్రోన్స్ అంటే ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేనట్టేనా, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!