CM KCR Press Meet: రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారాయి. టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, బీరం హర్ష వర్ధన్ రడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టుల పదవులు  ఇస్తామంటూ కొందరు ప్రలోభ పెట్టారనే విషయం చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారాన్ని మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తీసుకున్నారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలో దిగనున్నారు. ప్రగతి భవన్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి.. ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ శివారు మోయినాబాద్ అజీబ్ నగర్ లోని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించగా.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 


ఈ విషయంలో రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ లను అరెస్ట్ చేశారు. దర్యాప్త చేసి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ చేసిన చర్యలను తెలంగాణ మంత్రులు తీవ్రంగా ఖండించారు. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుశ్చర్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ 


అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ముంటే ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్ లో, హోటల్ లో, ప్రగతి భవన్ లో వారం రోజుల సీసీ టీవీ ఫుటేజీల్నీ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధం లేదని ఇదే విషయంపై తనతో పాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ డ్రామాకు తెరతీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతో దీని వెకనున్న పోలీసుల అంతు చూస్తాని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. 


ఆ నలుగురులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారే!


బేరసారాలు ఆడుతూ పట్టుబడిన ఫామ్ హౌస్ స్వయంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది టీఆర్ఎస్‌లోకి ఫిరాయించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కూడా అంతే. టీఆర్ఎస్‌లో సుదీర్ఘంగా ఉన్న నేత గువ్వల బాలరాజు మాత్రమే. అందుకే  వీరు ప్రలోభాలకు లొంగరని చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తంగా ఫిరాయింపుల వ్యవహారంమలో తెర వెనుక జరిగింది ఒకటైతే.. బయటకు తెలిసింది మరొకటన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. దీని వెనుక అసలు నిజానిజాలు కొన్ని ఎప్పటికీ మరుగునపడి ఉంటాయి. కొన్ని కీలకమైన విషయాలు మాత్రం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.