ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఫామ్‌హౌస్‌లో రైడ్‌కు వెళ్లామన్నారు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర. తమను కొంతమంది డబ్బులు, కాంట్రాక్ట్‌లు, ఇతర పదవుల ఆశ చూపిస్తున్నారని చెప్పినందునై అక్కడ తనిఖీలు చేశామని వివరించారు. ఈ సందర్భంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వీరిలో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌ ఉన్నట్టు వివరించారు. 


ఇందులో రామచంద్రభారతి అలియాస్‌ సతీష్ శర్మ ఢిల్లీ నుంచి వచ్చినట్టు స్టీఫెన్ రవీంద్ర పేర్కన్నారు. సింహయాజులు తిరుపతి నుంచి వచ్చారని వివరించారు. ఆఖరు వ్యక్తి నందకుమార్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీని వెనుక ఎవరు ఉన్నారు. వీళ్లు ఎందుకు ప్రలోభ పెట్టారు అనే అంశాలు దర్యాప్తులో తేలుతాయన్నారు. 


నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. పార్టీ ఫిరాయింపుల కోసం బేరసారాలుడుతూ దొరికిపోయారు ముగ్గురు వ్యక్తులు. పక్కా సమాచారం ఉండటంతో పోలీసులు  హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో ఉన్న ఓ ప్రముఖుడి ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. పోలీసులు దాడుల్లో రూ. 15కోట్ల వరకూ నగదు పట్టుబడింది. ఢిల్లీ నుంచి వచ్చన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులతో..నలుగురు ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు.  






కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షనర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు  మాట్లాడుతుండగా పోలీసులు దాడి చేశారు. తర్వాత వారు అక్కడ్నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారన్నదానిపై వారు స్పందించేందుకు నిరాకరించారు. అయితే రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్‌ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి ఢిల్లీకి చెందిన ఓ పీఠాధిపతిగా భావిస్తున్నారు. సింహయాజులు కూడా స్వామజీ వేషధారణలో ఉన్నారు. నందకుమార్.. అంబర్ పేటకు చెందిన ఓ జాతీయ పార్టీ నేత. అయన డెక్కన్ ప్రైడ్ హోటల్ ఓనర్‌గా చిరపరిచితులు. నందకుమార్ మధ్యవర్తిగా..  నలుగుురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కోసం బేరం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.