ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై స్పందించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ జాతీయ పార్టీ ప్రయత్నించిందన్న వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. మునుగోడు ఓటమి గ్రహించిన కేసీఆర్ కొత్త ఎత్తుగడతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. మర్రిగూడ మండలంలోని తిరుగండ్ల పల్లి నుంచి మాట్లాడిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
టీఆర్‌ెస్ ఓ పెద్ద డ్రామా కంపెనీ అంటూ దుయ్యబట్టారు బండి సంజయ్. నిజంగా ఇప్పుడు జరిగింది నిజమని కేసీఆర్ నమ్మితే... యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధపడాలని సవాల్ చేశారు. బీజేపీ తరఫున తాను ఒక్కడినే వస్తానని... కేసీఆర్ ఎప్పుడు టైం తీసుకొని రెడీ అంటే తాము సిద్ధమన్నారు. ఇలాంటి చిల్లర నాటకాలకు కాలం చెల్లిందని.. తెలంగాణ సమాజం ఇలాంటివి నమ్మే పరిస్థితి లేదన్నారు బండి.
మొదటి నుంచి హిందూ సమాజమంటే కేసీఆర్‌కు కోపమని... అందుకే ఈ కుట్రలో స్వామీజీలను లారని వారిపై నమ్మకం సన్నగిల్లిలే చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. ఫామ్‌హౌజ్ టీఆర్‌ఎస్ వాళ్లదేనని.. అందులో బీజేపీ వాళ్లెవరూ లేరని తేల్చి చెప్పారు. తాను చాలా మందితో ఫొటోలు దిగుతుంటామని.. వాళ్లంతా తమ కార్యకర్తలు అయిపోరని అన్నారు. అలా అనుకుంటే చాలా మంది మంత్రులతో ఇప్పుడు దొరికిన వాళ్లు ఫొటోలు దిగారని ఫొటోలు చూపించారు బండి సంజయ్. అసలు బేరసారాలకు కాస్త పేరున్న నాయకులు వెళ్తారు కానీ... ఇలా స్వామీజీలను ఎక్కడైనా పంపిస్తారా అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై కుట్ర అంతా దక్కన్ కిచెన్‌లోనే జరిగిందన్న బండి సంజయ్.... గత మూడు రోజులుగా ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన వ్యక్తులతో దొరిగిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్‌కు తరలించకుండా ప్రగతి భవవ్‌కు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమని... కచ్చితంగా దీని అసలు బాగోతం త్వరలోనే వెలుగు చూస్తుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ఆరోపణలపై కేంద్రంతో సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు.
టీఆర్‌ఎస్ కట్టుకథలు చూసి ప్రజలు తెగ నవ్వుకుంటున్నారని అన్నారు బండి సంజయ్. మూడ్రోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర పన్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉండి బీజేపీవైపు చూస్తున్న తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించడానికే ఈ ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు ఈ నాటకమంతా కేసీఆర్ మెడకు చుట్టుకోవడం ఖాయమన్నారు బండి.
ఫాంహౌస్ అడ్డగా గుట్కా వ్యాపారం జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు బండి. ఫామ్‌హౌజ వాళ్లదే, ఫిర్యాదు వాళ్లదే.. బాధితులు, నిందితులు వాళ్లేనని ఎద్దేవా చేశారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్థరూపాయికి కూడా ఎవరూ కొనరని సెటైర్లు వేశారు.
మరో బీజేపీ లీడర్ డీకే అరుణ కూడా ఈ కొనుగోలు వ్యవహారంపై స్పందించారు. మునుగోడులో ఓడిపోతున్నామనే కేసీఆర్ ఈ చిల్లర డ్రామాకు తెరతీశారన్నారు. ఇది కేసీఆర్ ఆడించిన డ్రామా కాదంటే... యాదాద్రిలో ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ చేశారు. ఫామ్‌హౌజ్‌లో ఉన్న బీజేపీ వాళ్లు ఎవరో చెప్పాలన్నారు. ఏ పెద్ద కేస్ ఛేదించామన్న ఆనందం పోలీసుల మొహాల్లో ఎక్కడా లేదన్న ఆమె... కేసీఆర్ స్క్రిప్టు చదివారన్నారు. పోలీసులు చెప్పిన వాళ్లెవరూ బీజేపీ లీడర్లు కాదన్నారు. ఆ నలుగురు కేసీఆర్ చుట్టే ఉన్నారని ఆరోపించారు. ఆ నలుగురిలో వంద కోట్లకు కొనేంత అర్హత ఎవరికీ లేదన్నారు. మరోసారి గెలిచే సత్తా వాళ్లలో ఒకరికీ లేదని ఆరోపించారు.