పేగుల ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మనం తీసుకున్న ఆహారం అరుగుదలలో అవే కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల క్రోన్స్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇది జీర్ణాశయ కణజాలం ఎర్రబడేలా చేస్తుంది. జీర్ణాశయాంతర పేగుల్లో అనేక సమస్యలకి దారి తీస్తుంది. ఇది ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి(IBD) గా పరిగణిస్తారు. ఇది కొందరిలో స్వల్పంగాను, మరికొందరిలో తీవ్రంగాను ఉంటుంది. జీర్ణాశయాంతర పేగులతో పాటు నోటి నుంచి పాయువు వరకు ఏదైనా భాగాన్ని ప్రభావితం చేస్తుంది. దీనికి నివారణ లేకపోవడం అతిపెద్ద సమస్య. ఈ వ్యాధి లక్షణాలు తగ్గించేందుకు మాత్రం చికిత్స చేయవచ్చు. ఈ వ్యాధి ప్రారంభ సంకేతాలు గమనించడం కొంచెం కష్టం. కానీ వ్యాధి ముదిరే కొద్ది లక్షణాలు అభివృద్ధి చెందుతాయి.
వాటిలో సాధారణ లక్షణాలు
☀ పొత్తి కడుపులో తిమ్మిరిగా అనిపించడం
☀ మలంలో రక్తం
☀ అతిసారం
☀ జ్వరం
☀ ఆకలి లేకపోవడం
☀ బరువు తగ్గడం
☀ అలసట
☀ తరచుగా పేగుల్లో తిప్పినట్టు అనిపించడం
ఈ లక్షణాలు నిరంతరం కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించడం చాలా అవసరం. పరిస్థితి తీవ్రంగా మారితే వ్యాధి తగ్గించడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారితే కనిపించే లక్షణాలు.
☀ అల్సర్(నోటి నుంచి పాయువు వరకి ఎక్కడైనా వస్తుంది)
☀ శ్వాస ఆడకపోవడం
☀ కీళ్ళు, చర్మం వాపు
క్రోన్స్ వ్యాధికి కారణం
ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం అంటూ ఏది లేదు. అయితే ఈ వ్యాధి రావడానికి దారితీసే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థ, జీవనశైలి పరోక్షంగా దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవే కాకుండా వయస్సు, ధూమపానం కూడా కారణం అవ్వొచ్చు. క్రోన్స్ వ్యాధి పేగు సంబంధిత అంటు వ్యాధులకి దారి తీసే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిలో ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. ఇది ఊపిరితిత్తులు, పేగు మార్గాన్ని రెండింటిని ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్‌లకు సరైన చికిత్స చేయకపోతే పరిస్థితి క్లిష్టతరం అవుతుంది.
ఈ వ్యాధికి చికిత్స ఏంటి?
క్రోన్స్ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. అయితే పేగుల్లో ఏర్పడే మంటని తగ్గించేందుకు ప్రయత్నించవచ్చు.
మందులు: ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీ డైరియాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉపయోగించవచ్చు. అధునాతన పరిస్థితుల కోసం బయోలాజిక్స్ ఎంపికలు ఉన్నాయి. వ్యాధి నయం చెయ్యడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
యాంటీ ఇంఫ్లమేటరీ మందులు: ఈ వ్యాధికి వైద్యులు సూచించే రెండు రకాల మందులు ఉన్నాయి. అవి ఓరల్ 5 అమినోసాలిసిలేట్స్, కార్టికోస్టెరాయిడ్స్. ఈ మందులు వాపుని తగ్గించి చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయి. కార్టికోస్టెరాయిడ్స్ సాధారణంగా తీవ్రమైన లక్షణాల కోసం సూచించబడతాయి.
ఇమ్యునోమోడ్యులేటర్లు: ఇవి రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసే మందులు. తాపజనక ప్రతిస్పందనను తగ్గిస్తుంది.
యాంటీ బయాటిక్స్: ఇవి వ్యాధి లక్షణాలను, పరిస్థితిని తగ్గించేందుకు సహకరిస్తాయి.
శస్త్ర చికిత్స: ఈ శస్త్ర చికిత్సలో GI ట్రాక్ట్ దెబ్బతిన్న భాగం తొలగించబడుతుంది. శస్త్రచికిత్సలు దెబ్బతిన్న కణజాలాలను సరి చేసి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సహాయపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: బాదం పప్పులు పేగుల ఆరోగ్యానికి మంచివేనా? అధ్యయనంలో ఏం తేలింది?