Bharat Jodo Yatra TS : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంటర్ అయింది. దీపావళి విరామం తర్వాత అసలు యాత్ర గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు మునుగోడు ఉపఎన్నికలు మరో వైపు యాత్రను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ముందుకెళ్తున్నారు. రాహుల్ పాదయాత్రను మునుగోడులో ప్లస్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నాయి. సొంత పార్టీ నేతల సహకారం లేకపోవడం.. ఆర్థికపరమైన ఇబ్బందులు.. వర్గ పోరాటాలు ఇలా అన్నింటినీ కరెక్ట్ చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితం సాధిస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.
భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం !
రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అడుగు పెట్టినప్పుడు .. అద్భుతమైన స్వాగతాన్ని పలికారు. ఆ టెంపో యాత్ర పొడుగునా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా... ప్రజలతా ఒక్క ఓటు ఇవ్వాలన్న విజ్ఞప్తిని ప్రజల్లోకి పంపే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కూడా తెలంగాణ విషయంలో ప్రత్యేకమైన ఆసక్తితో ఉన్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నాయకత్వ బలానికి .. పరీక్షగా భారత్ జోడో యాత్ర ను విజయవంతం చేయడాన్ని తీసుకున్నారు.
వర్గ పోరాటమే కాంగ్రెస్‌కు అసలు మైనస్ !
కాంగ్రెస్ అంటే వర్గ పోరాటాల నిలయం రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం.. కింది స్థాయి నాయకులను సంతోష పెట్టింది కానీ.. కాంగ్రెస్‌లో పాతుకుపోయిన నేతలకు మాత్రం ఇది నచ్చలేదు. అందుకే చాలా మంది సైలెంట్ అయ్యారు. మిగిలిన వారు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. పీసీసీ రేసులో చివరి వరకూ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూర్తి స్థాయిలో రెబల్‌గా మారారు. అయన వల్ల మిగతా పార్టీ మొత్తం డిస్ట్రబ్ అయింది. మిగిలిన సీనియర్లు కూడా ఎవరికి వారే అన్నట్లుగా పని చే్తున్నారు కానీ.. ఓ టీంగా పని చేయలేకపోతున్నారు. ఫలితంగా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్‌కు ఇదే చివరి చాన్స్ !
భారత్ జోడో యాత్ర ఓ రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చివరి చాన్స్ అనుకోవచ్చు. అన్ని రకాల సమస్యలతో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ దాదాపుగా రెండు వారాల సమయం ఇచ్చారు. తెలంగాణలో కీలక నియోజకవర్గాల గుండా సాగే పాదయాత్ర ద్వారా.. పార్టీని మళ్లీ పునరుజ్జీవింప చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంత కలసి కట్టుగా. .. చురుకుగా వ్యవహరిస్తారన్నదానిపైనే ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకోగలరా ?
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనూ గ్రుపులున్నాయి. కానీ భారత్ జోడో యాత్ర పై ఆ ప్రభావం పడకుండా చూసుకున్నారు. పెద్ద ఎత్తున యాత్రను విజయవంతం చేశారు. ఆ జోష్ కర్ణాటక కాంగ్రెస్‌లో ఎక్కువగా ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఖచ్చితంగా గెలిచి తీరుతామని అంటున్నారు. అలాంటి స్ఫూర్తిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకోవాలన్న అభిప్రాయం క్యాడర్ నుంచి వినిపిస్తోంది. రాహుల్ చాన్సిచ్చారు.. ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నది కాంగ్రెస్ నేతల చేతుల్లో ఉంది.