IRE vs ENG, T20 WC: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది! వన్డే ప్రపంచకప్‌ విజేత, భీకరమైన ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన సూపర్‌ 12 పోరులో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 5 పరుగుల తేడాతో విజయం అందుకుంది. గ్రూపులోని మిగతా జట్లకు ప్రమాద హెచ్చరికలు పంపించింది. ఐర్లాండ్‌ మొదట 157కు ఆలౌటైంది. ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 14.3 ఓవర్లకు 105/5తో నిలిచింది. డ/లూ విధానంలో 5 రన్స్‌ వెనకబడి ఉండటంతో ఓటమి తప్పలేదు.


బాల్‌బిర్నే జోరు


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ జట్టు స్కోరు 21 వద్దే పాల్ స్టిర్లింగ్‌ (14) వికెట్‌ చేజార్చుకుంది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన లార్కన్ టకర్‌ (34; 27 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి మరో ఓపెనర్‌ ఆండీ బాల్‌బిర్నే (62; 47 బంతుల్లో 5x4, 2x6) రెచ్చిపోయాడు. దూకుడుగా ఆడుతూ బౌండరీలు సాధించాడు. రెండో వికెట్‌కు 57 బంతుల్లో 82 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 103 వద్ద టకర్‌ను రనౌట్‌ అవ్వడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. మరికాసేపటికే హ్యారీ టెక్టార్‌ (0) డకౌట్‌ అయ్యాడు. 132 వద్ద బాల్‌బిర్నేతో పాటు జార్జ్‌ డాక్రెల్‌ (0) ఔటవ్వడంతో ఐర్లాండ్‌కు వరుస షాకులు తగిలాయి. ఆఖర్లో సామ్‌ కరణ్‌ వికెట్లు తీయడంతో ఐర్లాండ్‌ 19.2 ఓవర్లకు 157కు ఆలౌటైంది.




వికెట్లు టప టపా!


టార్గెట్‌ తక్కువే కావడంతో ఇంగ్లాండ్‌ సునాయాసంగా గెలుస్తుందనే అనుకున్నారు! కానీ ఐర్లాండ్‌ బౌలర్లు వారికి చుక్కలు చూపించారు. పరుగుల ఖాతా తెరవకముందే జోస్‌ బట్లర్‌ (0)ను జోష్ లిటిల్‌ ఔట్‌ చేశాడు. 14 వద్ద అలెక్స్‌ హేల్స్‌ (7)నూ అతడే పెవిలియన్‌ చేర్చాడు. పిచ్‌ కఠినంగా ఉండటం, ఆకాశంలో మబ్బులు ఉండటంతో ఆంగ్లేయులు వేగంగా ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. బెన్‌ స్టోక్స్‌ (6) విఫలమయ్యాడు. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్‌ (6) అండతో డేవిడ్‌ మలన్‌ (35; 37 బంతుల్లో 2x4, 0x6) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. 11 ఓవర్లో హ్యారీబ్రూక్‌, 14వ ఓవర్లో మలన్‌ ఔటవ్వడంతో రన్‌రేట్‌ బాగా పెరిగిపోయింది. మొయిన్‌ అలీ (24*; 12 బంతుల్లో 3x4, 1x6) గెలుపు బాధ్యత తీసుకున్నా వర్షం పడటంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. సమయం మించిపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.