T20 WC, SL vs AUS: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు తొలి విజయం అందుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. లంకేయులు నిర్దేశించిన 158 పరుగుల టార్గెట్‌ను 7 వికెట్ల తేడాతో ఛేదించింది. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ (59; 18 బంతుల్లో 4x4, 6x6) అజేయ హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఆరోన్‌ ఫించ్‌ (31*; 42 బంతుల్లో 1x6) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు లంకలో పాథుమ్‌ నిసాంక (40; 45 బంతుల్లో 2x4), చరిత్‌ అసలంక (38*; 25 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.


నిసాంక ఒక్కడే


టాస్‌ గెలిచిన ఆసీస్‌ వెంటనే లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్టు స్కోరు 5 వద్దే కుశాల్‌ మెండిస్‌ (5)ను ఔట్‌ చేసింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన ధనంజయ డిసిల్వా (26) సాయంతో పాథుమ్‌ నిసాంక (40) చక్కని భాగస్వామ్యం అందించాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో వీరిద్దరూ 2 ఓవర్ల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. డిసిల్వాను ఏగర్‌ ఔట్‌ చేశాడు. 97 వద్ద నిసాంక రనౌట్‌ అయాడు. కష్టాల్లో ఉన్న లంకను చరిత్‌ అసలంక (38) ఆదుకున్నాడు. వరుస వికెట్లు పడుతున్నా భారీ షాట్లు ఆడాడు. జట్టు స్కోరును 157-6కు చేర్చాడు.




స్టాయినిస్‌ దంచికొట్టుడు


లంక నిర్దేశించిన లక్ష్య ఛేదనలో ఆసీస్‌ కంగారు పడింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్ (31) స్ట్రైక్‌ రొటేట్‌ చేయలేకపోయాడు. స్కోరు వేగం పెంచాలన్న ఒత్తిడిలో జట్టు స్కోరు 26 వద్ద డేవిడ్‌ వార్నర్‌ (11) ఔటయ్యాడు. మిచెల్‌ మార్ష్‌ (18) సైతం బంతికో పరుగే చేశాడు. 8.3వ బంతికి అతడికి డిసిల్వా పెవిలియన్‌ పంపించాడు. రన్‌రేట్‌ భారీగా పెరుగుతున్న తరుణంలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (23; 12 బంతుల్లో 2x4, 2x6) విధ్వంసకరంగా ఆడేందుకు ప్రయత్నించాడు. భారీ షాట్‌ ఆడే క్రమంలో జట్టు స్కోరు 89 వద్ద ఔటయ్యాడు. అతడిచ్చిన క్యాచ్‌ను బౌండరీ సరిహద్దు వద్ద బండారా అద్భుతంగా ఒడిసిపట్టాడు.


ఆసీస్‌ స్కోరు 13.4 ఓవర్లకు 100కు చేరుకుంది. మ్యాచుపై లంక పట్టు సాధించే క్రమంలో మార్కస్‌ స్టాయినిస్‌ విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 15వ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీ, 16వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదేశాడు. తర్వాతి ఓవర్లోనూ ఓ సిక్సర్‌ బాదేసి విజయం అందించాడు. 21 బంతులుండగానే మ్యాచ్‌ ముగించడంతో ఆసీస్‌ రన్‌రేట్‌ కాస్త మెరుగైంది.