IND vs NED Super 12 Match: టీమ్‌ఇండియా అభిమానులకు చేదువార్త! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రెండో మ్యాచులో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఆడకపోవచ్చని సమాచారం. నెదర్లాండ్స్‌తో పోరులో అతడికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌కు అతడు హాజరవ్వకపోవడమే ఇందుకు నిదర్శనం!


సూపర్‌ 12 దశలో టీమ్‌ఇండియా తన రెండో మ్యాచును నెదర్లాండ్స్‌తో ఆడుతోంది. సిడ్నీ మైదానం ఇందుకు వేదిక. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఆట మొదలవుతుంది. భారత ఆటగాళ్లు ఇప్పటికే సిడ్నీ మైదానానికి చేరుకున్నారు. మంగళవారం కఠోరంగా ప్రాక్టీస్‌ చేశారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ చాలా ఎక్కువసేపు నెట్స్‌లో గడిపారు. హార్దిక్‌ పాండ్య మాత్రం ఈ సెషన్‌ అటెంట్‌ అవ్వలేదు.


పాకిస్థాన్‌తో మ్యాచులో హార్దిక్‌ పాండ్య నాలుగు ఓవర్లు వేశాడు. 3 వికెట్లు పడగొట్టాడు. వెంటవెంటనే టాప్‌ ఆర్డర్‌ వికెట్లు పడటంతో హార్దిక్‌ పాండ్య 6 ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చాడు. విరాట్‌ కోహ్లీకి అండగా నిలిచాడు. మొదట్లో ధాటిగా బ్యాటింగ్‌ చేసినా డెత్‌ ఓవర్లలో లయ కోల్పోయినట్టు అనిపించింది. బహుశా అతడు తిమ్మిర్లతో ఇబ్బంది పడ్డాడని తెలిసింది. అందుకే అతడి పనిభారాన్ని పర్యవేక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా నెదర్లాండ్స్‌ మ్యాచులో విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటోందట. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ మొత్తం అతడి ఫిట్‌నెస్‌ను కాపాడాలని పట్టుదలగా ఉంది.


ఈ కారణాలతో హార్దిక్‌ పాండ్య నేటి ప్రాక్టీస్‌ సెషన్‌కు రాలేదని అంటున్నారు. ఒకవేళ అంతా బాగుంటే నెదర్లాండ్స్‌ మ్యాచుకు అతడు అందుబాటులో ఉండొచ్చనీ చెప్తున్నారు. ఎందుకంటే నేటి సెషన్‌కు బౌలర్లూ రాలేదు. వారికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. నెదర్లాండ్స్ చిన్న జట్టే కావడంతో ఒకరిద్దరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యం లేదు. కాగా ఈమ్యాచ్‌కు వర్షం గండం పొంచివుంది.


లానినా ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే జింబాబ్వే, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దైంది. మరో పది నిమిషాల్లో దక్షిణాఫ్రికా గెలుస్తుందనగా వరుణుడు బ్యాటింగ్‌కు దిగాడు. దాంతో ఆటను నిలిపివేసి చెరో పాయింట్‌ ఇచ్చారు. సిడ్నీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మంగళవారం అక్కడ భారీ వర్షం కురిసింది. భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ జరిగే గురువారం రోజూ 25 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందట.