Weather Forecast for India vs Netherlands: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా రెండో మ్యాచుకు సిద్ధమైంది! పసికూనే అయినా గట్టిగా పోరాడుతున్న నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. సిడ్నీ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక! చిరకాల ప్రత్యర్థి, దాయాదిపై గెలుపుతో హిట్‌మ్యాన్‌ సేన జోష్‌తో ఉంది. దాంతో అభిమానులు అన్ని మ్యాచులను ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అయితే వారికో చేదువార్త! నెదర్లాండ్స్‌తో మ్యాచుకు వాతావరణం అడ్డంకిగా మారనుంది!


లానినా ప్రభావం వల్ల ఆస్ట్రేలియాలో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే జింబాబ్వే, దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రద్దైంది. మరో పది నిమిషాల్లో దక్షిణాఫ్రికా గెలుస్తుందనగా వరుణుడు బ్యాటింగ్‌కు దిగాడు. దాంతో ఆటను నిలిపివేసి చెరో పాయింట్‌ ఇచ్చారు. సిడ్నీలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మంగళవారం అక్కడ భారీ వర్షం కురిసింది. భారత్‌, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ జరిగే గురువారం రోజూ 25 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందట.


మెల్‌బోర్న్‌ నుంచి టీమ్‌ఇండియా ఇప్పటికే సిడ్నీ చేరుకుంది. మంగళవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ కఠోరంగా సాధన చేశారు. కేటాయించిన సమయాన్ని మించే చెమటోచ్చారు. తొలి మ్యాచులో వీరిద్దరూ అంచనాలను అందుకోలేదు. స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. విరాట్‌ కోహ్లీ సైతం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్య, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌, అర్షదీప్‌ సింగ్‌ సాధన చేయలేదు. తగినంత విశ్రాంతి ఇవ్వాలన్నదే ఉద్దేశం. సెషన్‌ ముగిసిన వెంటనే సిడ్నీలో వర్షం కురవడం మొదలైంది. బుధవారం ఎలాగూ మ్యాచ్‌ లేదు. గురువారం వరకు పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నారు. ఒకవేళ కురిసినా తెరపినిస్తూ వచ్చే అవకాశం ఉందంటున్నారు.




భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచు పైనా నీలి మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం 95 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. అదృష్టవశాత్తు ఈ హై వోల్టేజీ పోరుకు వరుణుడు ఎలాంటి అంతరాయం కలిగించలేదు. మ్యాచ్‌ పూర్తిగా జరిగింది. అంతకు మించి విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) ఓ అద్భుతమైన ఇన్నింగ్సుతో టీమ్‌ఇండియాకు విజయం అందించాడు. తోడుగా హార్దిక్‌ పాండ్య (40; 37 బంతుల్లో 1x4, 2x6) చెలరేగడంతో దాయాది పాకిస్థాన్‌ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను సమయోచితంగా ఛేదించింది. ఒక్కో ఇటుక పేర్చినట్టు.. లెక్కపెట్టుకొని మరీ స్కోరు చేసింది. 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది.  అంతకు ముందు బాబర్‌ సేనలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (3/32), హార్దిక్‌ పాండ్య (3/30) రాణించారు.