T20 World Cup 2022: ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీ (Virat kohli) క్రికెట్ మైదానంలో చేసిన అద్భుతాలు ఎన్నో! అద్వితీయమైన ద్విశతకాలు.. వరుస పెట్టి సెంచరీలు.. మునికాళ్లపై నిలబెట్టే ఛేజింగులు.. వికెట్ల మధ్య చిరుతలా పరుగులు! ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి! అతడి విధ్వంసాలు స్టేడియంలోనే కాదు బయటా అవాక్కయ్యేలా చేస్తున్నాయి. పాకిస్థాన్‌పై అతడి ఆటకు దీపావళి ముందు రోజు యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా పడిపోయాయి!


ఇప్పుడంతా యూపీఐ ట్రెండ్‌


భారతీయులకు దీపావళి అంటే ఎంతిష్టమో తెలిసిందే! ఈ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకొనేందుకు విపరీతంగా షాపింగ్‌ చేస్తుంటారు. బంగారం, వస్త్రాలు, స్థలాలు, వాహనాలు, ఇళ్లు, షేర్లు, మిఠాయిలు, కిరాణా సామగ్రి ఇలా ఎన్నింటినో కొనుగోలు చేస్తారు. ఇందుకోసం ఒకప్పుడంతా నగదు చెల్లించేవారు. ఇప్పుడంతా యూపీఐ ట్రెండ్‌ కదా! దాదాపుగా కోట్లలోనే లావాదేవీలు జరుగుతున్నాయి. విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ దెబ్బకు అక్టోబర్‌ 23న ఒక్కసారిగా ఇవి ఆగిపోయాయి. షాపింగ్‌ నిలిచిపోయిందని సమాచారం.




పడిపోయన లావాదేవీలు


ఆదివారం ఉదయం 10 గంటలకు 7.5 శాతానికి యూపీఐ లావాదేవీలు చేరుకున్నాయి. 11 నుంచి 12 గంటల సమయంలో 15 శాతానికి పెరిగాయి. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న 1:30-3 గంటల మధ్యన యూపీఐ లావాదేవీలు -6 శాతానికి పడిపోయాయి. 5 గంటల వరకు ఈ సరళి ఇలాగే కొనసాగింది. ఎప్పుడైతే మ్యాచ్‌ ఆఖరి 4 ఓవర్లకు వచ్చిందో.. విరాట్‌ కోహ్లీ విధ్వంసం షురూ చేశాడో..  ఇవి -15 శాతానికి పడిపోయాయి. ఇక ఆఖరి ఓవర్‌ ఆడుతున్నప్పుడు పతనం -22 శాతానికి చేరింది. మ్యాచ్‌ ముగిశాక దీపావళి షాపింగ్‌ మళ్లీ మొదలైంది. లావాదేవీలు స్థిరంగా 6 శాతం వద్ద కొనసాగాయి.


సచిన్‌ ఆడితే జీడీపీ ఆగిపోయేదట!


భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంగా భావిస్తుంటారు. కీలక మ్యాచులు జరిగే సమయంలో దాదాపుగా అన్ని యాక్టివిటీస్‌ ఆగిపోతుంటాయి. ఒకప్పుడు సచిన్‌ తెందూల్కర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే ఇండియా జీడీపీ ఆగిపోయేదని సరదాగా చెప్పేవారు. ఇప్పుడా వారసత్వాన్ని విరాట్‌ కోహ్లీ కొనసాగిస్తున్నాడని అభిమానులు అంటున్నారు. నిజానికి పాకిస్థాన్‌ మ్యాచులో అతడు బ్యాటింగ్‌ చేస్తుంటే ప్రపంచమే స్తంభించిపోయినట్టు అనిపించింది. అప్పటి వరకు మ్యాచ్‌ పోతుందనే ఆందోళనలో ఉన్న అభిమానుల్లో కింగ్‌ కోహ్లీ ఒక్కసారిగా జోష్‌ నింపాడు. తనదైన రీతిలో, తను ఎక్కువగా ఆడని షాట్లతో వరుస సిక్సర్లు బాదేసి గెలుపు సమీకరణాలు మార్చాడు. ఆ ఉత్కంఠ సమయంలో కోట్లాది మంది ప్రజలు టీవీ తెరలకు అతుక్కుపోయారు! అలాంటప్పుడు యూపీఐ లావాదేవీలు నిలిచిపోవడంలో ఆశ్చర్యం ఏముంటుందో చెప్పండి!