Fasting Attack on Cancer: ఏటా క్యాన్సర్ తో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చనిపోతున్నారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తించలేకపోవడం, అజాగ్రత్త కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రాథమిక దశలో క్యాన్సర్ ఉందని తెలుసుకుంటే చికిత్స ద్వారా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికన్ పరిశోధకులు కొత్త విషయాన్ని వెల్లడించారు. ఉపవాసంతో క్యాన్సర్ ను అదుపు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు.


ఉపవాసంతో క్యాన్సర్ కంట్రోల్


న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధన బృందం ఎలుకలపై తాజాగా అధ్యయనాన్ని నిర్వహించింది. తెల్లరక్త కణాల పనితీరును పరిశీలించింది. సాధారణ ఎలుకలతో పోల్చితే ఉపవాసం ఉన్న ఎలుకల్లో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అయినట్లు గుర్తించింది. అంతేకాదు, క్యాన్సర్ ను సమర్థవంతంగా అధిగమించడంలో ఉపవాసం సాయపడినట్లు తేల్చింది. ఉపవాసం క్యాన్సర్ కణితులను నిర్మూలించడంలో తెల్లరక్త కణాలు యాక్టివ్ గా పని చేసినట్లు వెల్లడైంది. ఉపవాసం తర్వాత తెల్లరక్త కణాలు మరింత యాక్టివ్ గా పని చేసినట్లు తేలింది. శరీరంలోని తెల్లరక్త కణాలు క్యాన్సర్ కణితుల వైపు మరింత యాక్టివ్ గా కెళ్లాయి. అయితే, క్యాన్సర్ కణితులతో పోరాడే సమయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. 


“క్యాన్సర్ కణితులు తమకు అవసరమైన పోషకాలను శరీరం నుంచి సమర్థవంతంగా గ్రహించుకుంటాయి. ఆ సమయంలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలకు హాని కలిగించే లిపిడ్స్ తో కూడిన ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేస్తాయి. ఉపవాసం అనేది తెల్లరక్త కణాలను యాక్టివ్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు వాటిని అణిచివేస్తున్నప్పటికీ మెరుగైన పనితీరు కనబర్చడంతో పాటు పునరుత్పత్తి శక్తిని పెంచుకుంటాయి” అని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ కు చెందిన ఇమ్యునాలజిస్ట్ జోసెఫ్ సన్ వెల్లడించారు.


పరిశోధన ఎలా చేశారంటే?


పరిశోధనలో భాగంగా క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి ఇంజెక్ట్ చేశారు. వాటిలో కొన్ని ఎలుకలకు నిత్యం ఆహారాన్ని అందించారు. మరికొన్ని ఎలుకలకు ఒక రోజు ఆహారం, మరుసటి రోజు ఉపవాసం ఉంచారు. అలా కొద్ది వారాల పాటు ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. ప్రయోగం తర్వాత కొద్ది రోజుల్లోనే ఉపవాసం చేయించని ఎలుకలు మృతి చెందాయి. కానీ, ఉపవాసం చేసిన ఎలుకలు మాత్రం ఆరోగ్యంగానే ఉన్నాయి. వాటి ఎముక మజ్జతో పాటు ప్లీహంలోనూ ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు కనిపించలేదు. ఆకలిని నియంత్రించడంతో పాటు లిప్ టిన్ హార్మోన్ ను అదుపు చేయడం వల్ల ఉపవాసం ఉన్న ఎలుకల్లో క్యాన్సర్ కణాలు అంతగా ప్రభావం చూపించలేకపోయాయని పరిశోధకులు తెలిపారు. మొత్తంగా ఉపవాసం క్యాన్సర్ ను సమర్థవంతంగా నయం చేస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. మరి మనుషులపై ఇది ఎలా పనిచేస్తుందో తెలియాల్సి ఉంది.


   


Read Also: నిద్రలో హార్ట్ ఎటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. నలభై ఏళ్లు దాటితే మగవారు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట