Flag bearers for India at the Olympics: అంతర్జాతీయ క్రీడా వేదికపై ఒలింపిక్స్‌(Olympics)లో భారత ప్రతినిధిగా... పతాకధారిగా ముందుండి నడిపించడం ప్రతీ అథ్లెట్‌ కల. ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలని  నిరంతర శ్రమ చేసి.. కఠోర పరిశ్రమ చేసి.. పతకం కలతో విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్లను ఈ ప్రపంచానికి పరిచయం చేసే వేడుకలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందు నడవడం అతి తక్కువ మందికి దక్కే మహాదృష్టం. కోటీ ఆశలు మోసుకుంటూ... పతక కలను నెరవేర్చుకోవాలని తపన పడుతున్న వారిని ముందుండి నడిపే అత్యున్నత గౌరవం ఇప్పటివరకూ అతి తక్కువ మంది దిగ్గజ ఆటగాళ్లకు మాత్రమే దక్కింది. ఇప్పటివరకూ కేవలం 17 మంది మాత్రమే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండడం విశేషం.


 

అత్యున్నత గౌరవం 

ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాల్లో దేశ పతాకాన్ని మోస్తూ ఆ దేశ అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించడం అత్యున్నత గౌరవంగా భావిస్తారు. మొత్తం 17 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత జెండాను మోస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఒక అథ్లెట్‌ ఒలింపిక్స్‌ పతకం సాధించినప్పుడు ఎంత గౌరవంగా భావిస్తాడో దేశానికి పతాకధారిగా ఉన్నప్పుడు కూడా అంతే గౌరవంగా భావిస్తాడు. దేశానికి క్రీడల్లో అత్యున్నత సేవ చేసిన క్రీడాకారులకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుంది. ఒలింపిక్ పతాకధారులు తమ క్రీడల్లో దిగ్గజాలుగా రాణించిన వారై ఉంటారు. ఒలింపిక్స్‌లో భారత జెండాను మోసిన తొలి భారతీయుడిగా పుర్మా బెనర్జీ నిలిచారు. 400 మీటర్ల స్ప్రింటర్  అయిన పుర్మా బెనర్జీ  1920 బెల్జియం ఒలింపిక్స్‌లో భారత జాతీయ జెండాను మోసిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు మొదటి కెప్టెన్ తాలిమెరెన్ అవోకు త్రివర్ణ పతాకం చేతబూని తొలిసారి... ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నేతృత్వం వహించాడు. 

 

17 మంది అథ్లెట్లకు గౌరవం

ఇప్పటివరకూ 17 మంది అథ్లెట్లు భారత పతాకాన్న చేతబూని ఇండియా బృందానికి ప్రతినిధిగా వ్యవహరించగా... అందులో ఎనిమిది మంది ఒలింపిక్‌ విజేతలు ఉన్నారు. 2016 రియో ఒలింపిక్స్‌లో మొదటి వ్యక్తిగత స్వర్ణ పతక విజేతదిగ్గజ అభినవ్ బింద్రా భారత పతాకధారిగా వ్యవహరించారు. 1932 ఒలింపిక్ హాకీ జట్టు కెప్టెన్ లాల్ షా భోఖారీ, మేజర్‌ ధ్యాన్ చంద్, బల్బీర్ సింగ్ కూడా భారత త్రివర్ణ పతాకంతో ఒలింపిక్స్‌ వేడుకల్లో పాల్గొని భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించే గౌరవం దక్కించుకున్నారు.

 

మూడుసార్లు ఒలింపిక్ బంగారు పతక విజేత బల్బీర్ సింగ్( Balbir Singh Sr) మాత్రమే రెండుసార్లు ఒలింపిక్స్‌లో భారతదేశ పతాకధారిగా నిలిచిన ఖ్యాతి దక్కించుకున్నారు. 1952, 1956లో రెండుసార్లు బల్బీర్‌ సింగ్‌కు రెండుసార్లు ఈ అత్యున్నత గౌరవం దక్కింది. స్ప్రింటర్ షైనీ అబ్రహం విల్సన్(Shiny-Abraham Wilson) 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత త్రివర్ణ పతాకధారిగా నిలిచిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించారు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో  అంజు బాబీ జార్జ్‌(Anju Bobby George)కు  ఆ గౌరవం దక్కింది. ఒలింపిక్స్‌లో హాకీ క్రీడాకారులు ఆరు సార్లు భారత త్రివర్ణ పతాకధారులుగా వ్యవహరించారు. లియాండర్ పేస్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సుశీల్ కుమార్ భారత ఒలింపిక్ పతాకధారులుగా గౌరవం దక్కించుకున్నారు. 

 

భారత పతాకధారులు

1920: పుర్మా బెనర్జీ (అథ్లెటిక్స్) 

1932: లాల్ షా భోకారి (హాకీ) 

1936: ధ్యాన్ చంద్ (హాకీ) 

1948: తాలిమెరెన్ అవో (ఫుట్‌బాల్) 

1952: బల్బీర్ సింగ్ సీనియర్ (హాకీ) 

1956: బల్బీర్ సింగ్ సీనియర్ (హాకీ) 

1964: గుర్బచన్ సింగ్ రంధవా (అథ్లెటిక్స్) 

1972: డెస్మండ్-నెవిల్లే డివైన్ జోన్స్ (బాక్సింగ్) 

1984: జాఫర్ ఇక్బాల్ (హాకీ) 

1988: కర్తార్ సింగ్ ధిల్లాన్ (రెజ్లింగ్) 

1992: షైనీ-అబ్రహం విల్సన్ (అథ్లెటిక్స్) 

1996: పర్గత్ సింగ్ (హాకీ) 

2000: లియాండర్ పేస్ (టెన్నిస్) 

2004: అంజు బాబీ జార్జ్ (అథ్లెటిక్స్) 

2008: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (షూటింగ్) 

2012: సుశీల్ కుమార్ (రెజ్లింగ్) 

2016: అభినవ్ బింద్రా (షూటింగ్) 

2020: మేరీ కోమ్ (బాక్సింగ్) , మన్‌ప్రీత్ సింగ్ (హాకీ) 

2024: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్) .