నడక అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని వైద్య నిపుణులు మనకు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే చాలామందిలో ఎంత దూరం నడవాలి.. ఎంతసేపు నడవాలి.. ఎలా నడవాలి అనే సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం డాక్టర్లు భిన్నాభిప్రాయాలు చెబుతున్నారు. కొందరు రోజూ పదివేల అడుగులు నడిస్తే సరిపోతుందని చెబుతున్నారు. దానివల్ల అనేక వ్యాధుల భారీ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఏది బెటర్.. పది వేల అడుగులా? నడిచే విధానమా?


మరి కొంతమంది నిపుణులు మాత్రం పదివేల అడుగులు అనేది కేవలం ఒక కొలమానం మాత్రమేనని, దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఎంత దూరం నడిచింది అన్నది కాదని, మీరు నడిచే విధానం సరిగ్గా ఉండాలని.. అప్పుడే శరీరంలో క్యాలరీలు కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నిమిషానికి 100 అడుగులు నడిస్తేనే మన శరీరంలో కేలరీలు కరుగుతాయని చెబుతున్నారు.


సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి నిమిషానికి 130 అడుగుల వరకు నడవచ్చు. అయితే నడిచే విధానంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే శరీరం అత్యధిక స్థాయిలో కొవ్వులు కరిగించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పదివేల అడుగుల నడక అనేది మానసికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. కానీ మానసికంగా ఎంత ప్రోత్సాహం లభించినప్పటికీ శారీరకంగా మీ ఆరోగ్యంలో మార్పులు రానప్పుడు పదివేల అడుగుల నడక అనేది వృథా అని అంటున్నారు. 


పదివేల అడుగుల నడక కూడా సరైన పద్ధతిలో సరైన టెక్నిక్కులను ఉపయోగించినప్పుడే ఫలితం లభిస్తుందని సూచిస్తున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అభిప్రాయం ప్రకారం.. నిమిషానికి 100 అడుగులు నడిచినప్పుడు మన శరీరంలో కదలిక మొదలవుతుందని తద్వారా క్యాలరీలు కరుగుతాయని సూచిస్తున్నారు. రోజూ ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 150 నిమిషాలు నడవాలని, అలా నడిచినప్పుడు అనేక ప్రమాదకరమైన జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చని తెలుపుతున్నారు.


అడుగులు లెక్కపెట్టొద్దు


అయితే మరి కొంత మంది నిపుణులు అభిప్రాయం ప్రకారం అడుగులను లెక్కపెట్టుకుంటూ, అడుగులను కొలుచుకుంటూ నడిచినట్లైతే నిరుత్సాహం వస్తుందని, అందుకే మీరు నడక నడిచేటప్పుడు, ఆ నడకను ఆస్వాదిస్తూ వాకింగ్ చేసినట్లయితే, మీరు మరింత ఎక్కువ దూరం నడిచే అవకాశం ఉందని నిపుణులు సూచన చేస్తున్నారు. అయితే ఈ అడుగులను లెక్క పెట్టేందుకు చాలా మంది ఫిట్ బ్యాండ్లను, స్మార్ట్ వాచీలను పెట్టుకొని వాటి ద్వారా సహాయం పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు మీ నడక వేగాన్ని, గుండె లయను, శరీరంలో ఆక్సిజన్ ను, మీరు నడిచిన దూరాన్ని కూడా సూచిస్తున్నాయి. 


రోజూ వాకింగ్ చేయడం వల్ల మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ నిల్వలు, షుగర్ నిల్వలు, రక్త పోటును తగ్గించడంలో కూడా నడక ఉపయోగపడుతుందని, అందుకే ఎవరైతే తమ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉందని భావిస్తారో వారు ప్రతి రోజు వాకింగ్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read : కసిగా 10 వేల అడుగులు టార్గెట్ పెట్టుకుని నడిచేస్తున్నారా? ఈ సమస్యలు తప్పవు, ఈ టిప్స్ పాటించండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.