తల నొప్పి సర్వ సాధారణమే అని అంతా అనుకుంటారు. కొన్ని తలనొప్పులు పదే పదే వేధిస్తుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ఓ మహిళకు ఎదురైన పరిస్థితి.. ఇప్పటి వరకు మీరు విని ఉండరు. ఎందుకంటే.. ఆమె షవర్ కింద స్నానం చేస్తుంటే చాలు.. తల నొప్పి వచ్చేస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఎప్పుడు షవర్ కిందకెళ్లినా ఇదే పరిస్థితి. దీంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. ఇంతకీ ఆమె సమస్య ఏమిటీ?


60 సంవత్సరాల వయసున్న శ్రీలంక మహిళకు మొదటి సారిగా మార్చి 2021లో వేడి నీళ్లతో తలస్నానం చేసిన వెంటనే తీవ్రమైన తలనొప్పి వచ్చిందట. మరుసటిరోజు ఆమె మళ్లీ తలస్నానం చేసింది. ఈ సారి ఆమెకు భరించలేనంత తలనొప్పి వచ్చింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆమె మెదడుకు రకరకాల స్కానింగ్ లు నిర్వహించారు. కానీ అన్ని రిపోర్టుల్లో ఆమెకు ఎలాంటి సమస్య కనిపించలేదట. ఎలాంటి అనారోగ్యాలు లేవని  శ్రీలంక లోని కొలంబో యూనివర్సిటి వైద్యులు తెలిపారు.


ఆమెకు పరీక్షలు జరిపిన వైద్యులు ఆమెకు బాత్ రిలేటెడ్ హెడేక్ (BRH)తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఆమెకు బీపీని కంట్రోల్ చేసే మెడిసిన్ నిమోడిపైన్ ను సూచించారు. మూడు రోజుల తర్వాత నెమ్మదిగా ఆమె తలనొప్పి తగ్గిపోయింది. ఈ తలనొప్పి థండర్ క్లాప్ తలనొప్పి వంటిదే. అకస్మాత్తుగా వస్తుంది. తలనొప్పి మొదలైనపుడు చాలా బాధాకరంగా ఉంటుంది. ఇలా థండర్ క్లాప్ హెడేక్‌తో బాధపడుతున్నవారు ఇది ఇతర సాధారణ తలనొప్పి మాదిరిగా ఉండదని, చాలా తీవ్రంగా, భరించ వీలు లేకుండా ఉంటుందని నొప్పి గురించి అభివర్ణిస్తుంటారు.


రెండేళ్ల తర్వాత సదరు మహిళకు తిరిగి పరీక్షలు చేసినప్పుడు ఆమె వేడి నీటి తలస్నానానికి ఆమె దూరంగా ఉండడం వల్ల తిరిగి అలాంటి తలనొప్పి రాలేదని చెప్పారట. నిపుణులు ఇప్పుడు BRH ని ఇంటర్నల్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెడ్ చెక్ డిజార్డర్స్ లో చేర్చాలని సూచిస్తున్నారు. ఇది అన్ని రకాల తలనొప్పులను తలకు సంబంధించిన వ్యాధులను మేనేజ్ చేయడం, వర్గీకరణకు ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ఉపయోగించే వ్యవస్థ.


తలనొప్పి వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు



  • వీలైనంత విశ్రాంతిగా ఉండాలి. మాట్లాడకుండా ఉంటే మరీ మంచిది.

  • పారాసెమాటల్ లేదా ఇబుప్రొఫెన్ వంటి నొప్పి నివారణ మందులు వేసుకోవచ్చు.

  • వీలైనంత ఎక్కువ నీటిని తాగాలి. ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు.

  • స్ట్రెస్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఇలాంటపుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉపయోగించడం, విశ్రాంతిగా ఉండడం అవసరం.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వల్ల ఆక్సిజన్ వినియోగం పెరిగి తలనొప్పి రాకుండా నివారించవచ్చు.


డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?


మీకు ఫార్మసిస్ట్ సూచించిన మందులతో తలనొప్పి తగ్గనప్పుడు, రోజుల తరబడి తలనొప్పి వేధిస్తున్నపుడు, ఎలాంటి మందులు వేసుకున్పప్పటికీ తలనొప్పి తీవ్రం అవుతున్నపుడు లేదా తరచుగా తలనొప్పి వచ్చి మీ రోజువారి పనులకు అడ్డంకిగా లేదా మీ పనిసామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తున్నపుడు తప్పకుండా డాక్టర్ ను కలిసి సరైన చికిత్స తీసుకోవడం అవసరం.


Also read : నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు, పనులకు దూరంగా ఉండండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.