Food Rules In Shastra: హిందూ సంప్ర‌దాయంలో ఆహారం లేదా భోజనానికి సంబంధించిన నియమాల గురించి చాలా విషయాల గురించి స్ప‌ష్టంగా వివ‌రించారు. వీటిలో ఒకటి ఆహారం తీసుకోవ‌డానికి సంబంధించిన‌ది. మీరు ఆహారం తినే ముందు మంత్రాలు పఠించడం, ఆపై ప‌రిషేచ‌నం (కంచం లేదా ఆకు చుట్టూ నీరు చల్లడం) చేయ‌డం మీరు చూసే ఉంటారు. మీ ఇంట్లో పెద్ద‌లు ఎవరైనా ఈ నియమాలను పాటించడం గ‌మ‌నించే ఉంటారు.


ఈ నియ‌మాన్ని చాలా మంది అనుసరిస్తున్నారు. తినే ముందు కంచం చుట్టూ నీళ్లు చల్లాలి అని గ్రంధాలలో చెప్పారు. అయితే ఇలా ఎందుకు చేయాల‌ని ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి మతపరమైన కారణం మాత్రమే కాదు, శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ కారణాల గురించి మీకు తెలియకపోతే, తెలుసుకోండి.


1. కృతజ్ఞత, గౌరవాన్ని వ్యక్తపరచడం


ఆహారం ఉన్న కంచం లేదా ఆకు చుట్టూ ప‌రిషేచ‌నం (నీళ్లు చల్లడం) చేయ‌డం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఈ నియ‌మాన్ని పాటిస్తున్నారు. మ‌రి ఈ నియ‌మం వెనుక కార‌ణ‌మేంటో తెలుసా? మనం ఇలా చేసినప్పుడు, మనం తినే ప్రదేశంలో ప్రతికూలత ప్రవేశించకుండా కంచం చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. దీనికి మరొక కారణం కూడా చెప్పారు. తినడానికి ముందు కంచం చుట్టూ నీరు చల్లడం ద్వారా ఆహారం అందించే అన్నపూర్ణ దేవికి, మన ఇష్ట దైవానికి మనం గౌరవం చూపడ‌ంతో పాటు వారికి మ‌న‌ కృతజ్ఞతలు తెలియజేస్తాం.


2. శాస్త్రీయ కారణాలు


మతపరమైన కారణంతో పాటు ఈ ఆచారం వెనుక‌ శాస్త్రీయ కోణం కూడా ఉంది. పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చుని తినేవారు. అనేక క్రిమి కీట‌కాలు నేల‌పై తిరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో ఆహారం ఉన్న కంచం నుంచి వాటిని దూరంగా ఉంచడానికి లేదా కంచంలోకి అవి ప్రవేశించకుండా నిరోధించడానికి, దాని చుట్టూ నీరు చల్లేవారు. పూర్వ కాలంలో ఇంటి లోప‌ల‌ నేల మట్టితోనే తయారు చేసేవారు. అందువ‌ల్ల నీరు చల్లడం ద్వారా మట్టిని త‌డి చేస్తుంది, ధూళి గాలిలో ఎగరడానికి అనుమతించదు. ఫ‌లితంగా మన కంచంలోని ఆహారం శుభ్రంగా ఉంటుంది.


3. మంచంపై కూర్చొని భోజనం చేయవద్దు


నేటి ఆధునిక కాలంలో నేలపై కూర్చొని భోజనం చేసే విధానాన్ని మ‌ర‌చిపోతున్నారు. టేబుళ్లు, కొంద‌రు మంచం మీద కూర్చొని ఆహారం తింటారు. దీనితో పాటు హిందూ సంప్ర‌దాయాన్ని పాటించే వారు కూడా టీవీ ముందు, మంచం మీదో కూర్చుని భోజనం చేస్తున్నారు. మంచం మీద కూర్చొని తినకూడదు, త్రాగకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేయ‌డం వలన లక్ష్మీ దేవి కోపించి దారిద్య్రం మిమ్మల్ని చుట్టుముడుతుంది.


Also Read: ఆ ఆహారాన్ని గడువు దాటిన తర్వాత తింటే, ఇక అంతే సంగతులు!


హిందూ మతంలోని శాస్త్రాలు లేదా గ్రంధాలలో మనిషికి మేలు చేసే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, వాటి వెనుక‌ శాస్త్రీయ కారణం ఉంది. శాస్త్రాలలోని నియమాలను పాటించడం ద్వారా మనకు మంచి ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఆలోచనలు క‌లుగుతాయి.


Also Read: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.